డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్ల పోలీసుల వైఖరిని తప్పుబట్టారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.
హైదరాబాద్: బాట సింగారం వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై హోంశాఖ మంత్రి సహా ఇతరులకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు.
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కిషన్ రెడ్డి సహా రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ నుండి నేరుగా బీజేపీ కార్యాలయానికి తీసుకు వచ్చారు. బాట సింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్లే సమయంలో పోలీసులు వారిని శంషాబాద్ వద్ద అడ్డుకున్న విషయం తెలిసిందే.
గురువారంనాడు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. ఇలాంటి అణచివేత ధోరణి సరైంది కాదన్నారు. ఇవాళ జరిగిన పరిణామాలను కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలిస్తామంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఇంత భయమెందుకని ఆయన ప్రశ్నించారు.
also read:యుద్ధం మొదలైంది, నేనేమైనా ఉగ్రవాదినా?: కేసీఆర్ సర్కార్ పై కిషన్ రెడ్డి ఫైర్
కేంద్ర మంత్రిని సామాన్యుడి మాదిరిగా రోడ్డుపై నుండి ఈడ్చుకు రావడాన్ని రఘునందన్ రావు తప్పుబట్టారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలిస్తామని వెళ్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని రఘునందన్ రావు ప్రశ్నించారు. తాము ధర్నాలు, నిరసనలు చేయబోమని చెప్పినా కూడ వినలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్తున్నామని పోలీసుల నుండి అనుమతికి ధరఖాస్తు కూడ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినా కూడ పోలీసులు తమ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని రఘునందన్ రావు తప్పుబట్టారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. కానీ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుందని ఆయన విమర్శించారు.