Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. హైదరాబాద్ లోని మొత్తం ఆరు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
Heavy Rain-orange alert: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలో నేడు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురు వారాల్లో నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్ లోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా సిద్దిపేటలో 194 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ లో అత్యధికంగా 55.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్ డీపీఎస్ ) తెలిపింది. మంగళవారం హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగ్గా, కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ దాటింది. హైదరాబాద్ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.3 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. ఐఎండీ-హైదరాబాద్, టీఎస్డీపీఎస్ చేసిన అంచనాలను పరిగణనలోకి తీసుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
అలాగే, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.