Hyderabad: రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో మరో రెండు రోజుల పాటు 38-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత ఉష్ణోగ్రత తగ్గుతుందనీ, సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
heatwave alert in Telangana, Andhra: తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రెండు రోజులు, ఆంధ్రప్రదేశ్ ఒక రోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త శ్రావణి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సైతం కురుస్తున్నాయని తెలిపారు. దక్షిణ ఛత్తీస్ గఢ్ లో ద్రోణి ఉందని గుర్తించారు. గత 24 గంటలుగా రాష్ట్రవ్యాప్తంగా నైరుతి, వాయవ్య గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావం ఉంటుందన్నారు. రాగల 24 గంటల్లో ముఖ్యంగా ఉత్తరాదిలో ఇదే పరిస్థితి కొనసాగనుంది. దక్షిణ భాగంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నందున వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో సాధారణ ఉష్ణోగ్రత 36-38 డిగ్రీలుగా ఉండాల్సిందని ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ ఇది 40-41 డిగ్రీలకు చేరుకోవడం రాష్ట్రవ్యాప్తంగా అసౌకర్యాన్ని కలిగిస్తోంది. రాబోయే 24 గంటల్లో ఇదే విధమైన వాతావరణం వుండే అవకాశముందని పేర్కొన్నారు. తెలంగాణలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని, మధ్య భాగంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
undefined
మరో మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనుంది. ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడనున్నాయి. రాబోయే 5 రోజుల్లో 38-40 డిగ్రీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. రుతుపవనాలు కూడా వస్తున్నాయి, జూన్ 15 లేదా 16 నుండి రుతుపవనాల వాతావరణం, ముఖ్యంగా తెలంగాణలోని దక్షిణ ప్రాంతాలలో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లో మరో రెండు రోజుల పాటు 38-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ తర్వాత ఉష్ణోగ్రత తగ్గుతుందనీ, సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, ఉరుములు-మెరుపులతో కూడిన ఈదురుగాలులు మరో 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఆంధ్రాలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని దక్షిణ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రారంభం కానున్నందున రేపటి నుంచి వడగాల్పులు తగ్గుముఖం పట్టనున్నాయి.