శిరీష మృతి కేసును ఎన్సీడబ్ల్యూ సుమోటోగా స్వీకరించింది. మూడు రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్టులు ఇవ్వాలంటూ జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ డీజీపికి సూచన చేసింది.
న్యూఢిల్లీ : వికారాబాద్ లో పారామెడికల్ విద్యార్థి శిరీష మృతి కేసు పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. స్క్రూ డ్రైవర్ తో బాలిక కళ్ళు పొడిచేసి.. బ్లేడ్ తో గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఈ ఘటన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ పోలీసులను ఆదేశించింది.
మూడు రోజుల్లోగా ఈ కేసులో యాక్షన్ టేకెన్ రిపోర్టులను పంపించాలని తెలంగాణ డిజిపికి సూచనలు చేసింది. బాలికలు, యువతులు, మహిళలపై తెలంగాణలో పెరిగిపోతున్న నేరాల మీద జాతీయ మహిళా కమిషన్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, శనివారం నాడు మృతి చెందిన పారామెడికల్ విద్యార్థి శిరీష మృతి పై మిస్టరీ ఇంకా వీడలేదు. ఆమెది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఆమె మృతదేహానికి రెండు సార్లు పోస్ట్మార్టం నిర్వహించారు.వికారాబాద్ జిల్లా కాలాపూర్ శివారులోని నీటి కుంటలో ఆదివారం మధ్యాహ్నం శిరీష మృతదేహం లభించింది. ఆమె ఒంటిపై పలుచోట్ల గాయాలు ఉన్నాయి. రెండు కళ్ళు పొడిచి ఉన్నాయి.
undefined
బాచుపల్లి నారాయణ కాలేజీలో విషాదం.. హాస్టల్ బిల్డింగ్ మీదినుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య..
దీంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తండ్రి పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట ఆదివారం నాడు శిరీష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేశారు.
ఆ తర్వాత సోమవారం ఉదయం మరోసారి కాలాపూర్ లో శిరీష మృతదేహానికి రిపోస్టుమార్టం నిర్వహించారు. యువతి శరీరం మీద గాయాలు ఉన్నట్లు ధృవీకరించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నారు. ఆమెది కచ్చితంగా హత్యేనని… దీనిమీది పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి జంగయ్య, బావ అనిల్ మీద అనుమానాలు వ్యక్తం చేశారు.
శిరీష మృతికి వారిద్దరే కారణమంటూ మండిపడ్డారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఒక సమయంలో ఓ మహిళ శిరీష తండ్రిని కొట్టింది కూడా. దీంతో పోలీసులు కల్పించుకుని త్వరలోనే వాస్తవాలు తెలుస్తాయని ఓపిక పట్టాలని తెలియజేశారు. మృతురాలి తమ్ముడు శ్రీకాంత్.. తన చెల్లిని చంపిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని కోరాడు. శిరీష అంత్యక్రియలు ముగిసిన తర్వాత గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా తండ్రి జంగయ్యను బావ అనిళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.
విచారణ అనంతరం తండ్రి జంగయ్యను పోలీసులు వదిలేశారు. అనిల్ ను మాత్రం ఇంకా విచారిస్తున్నారు. శిరీష కాల్ డేటా ఆధారంగా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. దీని మీద పోలీసులు స్పందిస్తూ కేసు దర్యాప్తులో ఉందని.. ఇప్పుడే ఏమి చెప్పమని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు.