గద్వాల ఎస్పీని గెదుముతున్నరా ?

Published : Oct 26, 2017, 12:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
గద్వాల ఎస్పీని గెదుముతున్నరా ?

సారాంశం

30 కోట్ల కుట్ర జరుగుతున్నదా? కాంగ్రెస్, టిఆర్ఎస్ చేతులు కలిపాయని ఆరోపణలు జిల్లాలో హాట్ హాట్ గా చర్చలు ఎస్పీకి మద్దతుగా చక్కర్లు కొడుతున్న కరపత్రం బంగ్లా కుటుంబం కుట్రలు అంటూ కరపత్రం లో వెల్లడి

తెలంగాణలో డైనమిక్ పోలీసు అధికారుల జాబితాలో గద్వాల ఎస్పీ విజయ్ కుమార్ కూడా ఒకరు. ఆయన గద్వాల జిల్లా ఏర్పాటైన నాటినుంచి అక్కడ అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రైం రేట్ తగ్గించండి అన్న సిఎం ఆదేశాలు తప్ప ఆయన ఇంకే ముచ్చట పట్టించుకోలేదు. వ్యాపారాలు, చీకటి వ్యవహారాలకు జీ హుజూర్ అనలేదు. అలాంటి అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపిండు. దీంతో ఆ ఎస్పీ ని గెదిమికొట్టేందుకు వైరిపక్షాలు ఏకమయ్యాయా? అధికార విపక్ష పార్టీల్లోని అక్రమార్కులంతా ఏకమై ఎస్పీని తరిమేందుకు రంగం సిద్ధం చేశారా? ఈ విషయాలు తెలియాలంటే ఈ న్యూస్ చదవండి.

గద్వాల జిల్లా ఏర్పాటు కాగానే తొలి కలెక్టర్ గా రజత్ కుమార్ షైనీ, ఎస్పీగా విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రం మొదలుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నల్ల వ్యాపారానికి గద్వాల కేంద్ర బిందువుగా ఉండేదన్న విమర్శలున్నాయి. దీంతో ఇక్కడ అక్రమ దందాలు, దోపిడీలు, బెట్టింగ్, కాల్ మనీ లాంటి చీకటి పనులు నిత్యకృత్యమయ్యాయి. కానీ అదంతా గద్వాల జిల్లాగా ఏర్పాటు కాకముందు వరకే నడిచింది. జిల్లా ఏర్పాటైన తర్వాత ఆ జిల్లాకు వచ్చిన ఇద్దరు సివిల్ సర్వెంట్లు అక్రమార్కుల గుండెల్లో నిద్ర పోతున్నారట. అందులోనూ జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ డైనమిక్ ఆఫీసర్ అని జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు.

విజయ్ కుమార్ జిల్లాకు తొలి ఎస్పీగా నియమితులైన తర్వాత గద్వాల పట్టణంలో కల్తీ కల్లు విక్రయాలు పూర్తిగా బంద్ అయినయట. ఇసుక మాఫియా కోరలు తుంచేసిండట. వందకు 20 రూపాయల వడ్డీకి ఇచ్చి జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేసే కాల్ మనీ దందా బంద్ అయిందట. నకిలీ విత్తనాల విషయంలో అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తున్నారట. ఇంతకాలం ఇలాంటి అక్రమ దందాలు నడుపుతూ కోట్లకు పడగలెత్తిన వారంతా ఇప్పుడు కిక్కురుమనకుండా ఉన్నారట. దీంతో తమ ఆదాయ మార్గాలపై దెబ్బ కొట్టడంతో ఎస్పీని బదిలీ చేయించేందుకు గద్వాల జోగులాంబ జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల పెద్దలు ఏకమై కుట్రలకు తెర లేపారని స్థానికులు అంటున్నారు. ఈ విషయమై స్థానిక ప్రజా సంఘాల సభ్యులు, విద్యావంతులు, ఉద్యోగుల పేరుతో ఒక కరపత్రం జిల్లాలో విస్తృతంగా సర్యులేట్ అవుతున్నది.

అయితే ఆ కరపత్రంలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. జిల్లా ఎస్పీపై బంగ్లా కుటుంబం కక్ష కట్టిందని, బయట కొట్లాట లోపల చీకటి స్నేహం నడుపుతూ ఆ కుటుంబం ఇప్పుడు తమ అక్రమాలకు అడ్డువస్తున్నడని ఎస్పీని బదిలీ చేయించేందుకు మంత్రులను కలుపుకుని ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారని ఆ కరపత్రంలో వివరించారు. అయితే ఆ ఎస్పీని బదిలీ చేయించేందుకు జిల్లాలోని కీలక అక్రమార్కులంతా కలిసి 30 కోట్లు జమ చేశారని కూడా కరపత్రంలో రాశారు. 30 కోట్ల కుట్రకు ఎస్పీ బలి కాక తప్పదా? అన్న చర్చ ఇప్పుడు జిల్లా పాలనాయంత్రాంగంలో జోరుగా సాగుతున్నది.

ఆ కరపత్రం కాపీని ఇక్కడ ప్రచురిస్తున్నాం. మరిన్ని వివరాల కోసం కరపత్రం చదవండి.

నా లగేజీ అప్పుడే సర్దుకున్నా... ఎస్పీ

జిల్లా ఎస్పీని బదిలీ చేయించేందుకు ఒక బలమైన సామాజికవర్గం ప్రభుత్వంలోని మంత్రుల ద్వారా వత్తిడి చేయిస్తోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు ఎస్పీని కలిసేందుకు వెళ్లారట. ‘‘మిమ్మల్ని బదిలీ చేయిస్తున్నారని వార్తలొస్తున్నాయి కదా సర్’’ అని నిట్టూర్చారట. దానికి ఆ ఎస్పీ సమాధానం ఏమంటే... ‘‘అర్రే మీరెందుకు టెన్షన్ పడుతున్నరు? నేను నా లగేజీ ఎప్పుడో సర్ది పెట్టుకున్నా. ఆర్డర్ కాయితం రాంగనే ఎక్కడికి పంపితే అక్కడికి పోతా. సిఎం గారు తెలంగాణలో క్రైం రేట్ తగ్గించాలన్నారు. నేను అది తప్ప ఇంకో పని ముట్టుకోలేదు. ఇక్కడ క్రైం రేట్ తగ్గిందనుకుంటే నన్ను ఇంకో చోటుకు వేస్తారు’’ అని అన్నారట. దీంతో ఆ ఉద్యోగులు ఆవేదనతో అక్కడినుంచి వచ్చారట. ఈ విషయాన్ని గద్వాల జిల్లాకు చెందిన పేరు చెప్పడానికి సాహసం చేయని ఒక అధికారి ఏషియా నెట్ కు వివరించారు.

గద్వాల జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను ఎస్పీ ఓర్వడంలేదని, అందుకే ఆయనను బదిల చేయాలని అధికార టిఆర్ఎస్ నేతలు సైతం వత్తిడి చేస్తున్నట్లు కరపత్రంలో పొందుపరిచారు. ఆ ఒంకతో అయితేనే ఎస్పీ బదిలీ సులభంగా అవుతుందన్నది అక్రమార్కుల ఎత్తగడగా చెబుతున్నారు. మరి ఇప్పటికే ఎస్పీ బదిలీ వత్తిడి ముఖ్యమంత్రి కేసిఆర్ వద్దకు కూడా వెళ్లిందని విశ్వసనీయంగా తెలిసింది. మొత్తానికి మరో నాలుగైదు రోజుల్లోనే ఎస్పీని అక్కడి నుంచి బదిలీ చేసే అవకాశాలున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లక్ష్మిపార్వతి షాకింగ్ నిర్ణయం (వీడియో) చూడండి

https://goo.gl/CcQSvc

 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!