Harish Rao: చీల్చి చెండాడుతాం.. కాంగ్రెస్‌, బీజేపీల‌పై హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published : Aug 05, 2025, 01:19 PM IST
Harish Rao, BRS

సారాంశం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన ఆయన కాళేశ్వ‌రంపై ప్ర‌జేంటేష‌న్ ఇచ్చారు. 

ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోంది

హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 నెలలుగా ప్రజా సమస్యలు పక్కనపెట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని ఆరోపించారు. రైతులకు సరిపడా ఎరువులు లేకపోవడం, హాస్టల్‌ విద్యార్థులకు సరైన ఆహారం అందక ఆస్పత్రిపాలు కావడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యమవడంతో నిరుద్యోగులు రోడ్లెక్కే పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని చోట్లా కమిషన్లు పెట్టి అవినీతి ద్వారా డబ్బు సంపాదించడం, అనుమతులు ఇచ్చేందుకు లంచాలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారిందన్నారు.

 

 

"బీజేపీ-కాంగ్రెస్‌ కలసి కుట్ర చేస్తున్నారు"

హరీశ్‌రావు మరో కీలక ఆరోపణ చేశారు. ఎన్డీఎస్ఏ (NDSA) రిపోర్టుల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి చూపుతోందని వ్యాఖ్యానించారు. “గోదావరి మీద పోలవరం ప్రాజెక్ట్‌ మూడు సార్లు కూలిపోయింది కానీ ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇవ్వలేదు. మేడిగడ్డపై మాత్రం రాష్ట్రం అడగకముందే వచ్చి రిపోర్టు ఇస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకటి, బీఆర్‌ఎస్‌ రజతోత్సవం ముందు మరో రిపోర్టు ఇస్తూ బీజేపీ రాజకీయాలు ఆడుతోంది” అని ధ్వజమెత్తారు.

"రిపోర్టులో నిజాలు వక్రీకరించారు"

సోమ‌వారం నిన్న విడుదల చేసిన 60 పేజీల రిపోర్టులో వాస్తవాలు లేకుండా రాజకీయ దురుద్దేశాలు నిండిపోయాయని హ‌రీష్ రావు అన్నారు. అసలు కమిషన్‌ పూర్తి వివరాలు అందించకుండా, తనకు నచ్చిన పేరాలను మాత్రమే లీక్‌ చేసి, నచ్చని నాయకులపై ఆరోపణలు మోపారని విమర్శించారు. “నిజమైన రిపోర్టు బయటకు వస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్రం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు టీఏసీ (TAC), సెంట్రల్ వాటర్ కమిషన్‌ అనుమతులు ఇచ్చాయి. వాటిపై కూడా తప్పుబట్టినట్లు రిపోర్టులో కనిపిస్తోంది” అని హరీశ్‌రావు అన్నారు.

 

 

"655 పేజీల రిపోర్టు అసెంబ్లీలో పెట్టాలి"

“ప్రభుత్వానికి నిజాయితీగా ఉంటే పూర్తి రిపోర్టును సభలో పెట్టాలి. 655 పేజీల రిపోర్టు చూస్తే అసలు నిజం ఏమిటో ప్రజలకు తెలుస్తుంది. అసెంబ్లీలో ఆ రిపోర్టును చీల్చి చెండాడుతాం. ప్రజల ముందు వాస్తవాలు ఉంచుతాం” అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అంతేకాక త‌న‌తో పాటు కేసీఆర్‌ను కమిషన్‌ పిలిచినట్లు మీడియాలో లీక్‌లు ఇచ్చార‌న్నారు. కానీ ఇప్పటి వరకు అధికారిక నోటీసులు అందలేదని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ రిపోర్టును రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?