
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపులన్నీ కేసీఆర్ పర్యవేక్షణలోనే జరిగాయి. కేబినెట్ చర్చ లేకుండానే ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లారు. DPR సిద్ధం కాకముందే ఖర్చు అంచనాలపై ప్రధానికి లేఖ రాశారు. లొకేషన్ మార్చడం, అంచనాలు పెంచడం, నీళ్లు నింపడం వంటి కీలక నిర్ణయాలు ఆయనే తీసుకున్నారు.
మొదట ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయం రూ.38,500 కోట్లు కాగా… కేసీఆర్ లేఖ ప్రకారం 2016లో రూ.71,436 కోట్లకు పెరిగింది. 2022 మార్చి నాటికి అది రూ.1,10,248 కోట్లకు చేరింది.
తుమ్మిడిహెట్టి సైట్ ఫీజిబుల్ కాదని నిపుణుల నివేదికలో స్పష్టంగా చెప్పినా పట్టించుకోలేదు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం సాంకేతికంగా కష్టమని ఎక్స్‌పర్ట్ కమిటీ హెచ్చరించినా విస్మరించారు. వ్యాప్కోస్ అధ్యయనం చేయకుండానే హైపవర్ కమిటీ మీటింగ్‌లో సైట్ మార్చే నిర్ణయం తీసుకున్నారు.
బ్యారేజీలను నీటిని మళ్లించేందుకు మాత్రమే వాడాల్సి ఉన్నా, పూర్తి సామర్థ్యంతో నీళ్లు నిల్వ చేశారు. దీనివల్లే బ్యారేజీలు దెబ్బతిన్నాయని కమిషన్ తేల్చింది.
నిర్మాణ నాణ్యతను నిర్లక్ష్యం చేశారు. బ్యాక్ వాటర్ స్టడీస్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయలేదు. సీకెంట్ పైల్స్ వంటి నిర్మాణాలను సరైన ప్రమాణాలు లేకుండా ఆమోదించారు.
అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా బాధ్యులు. ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పనితీరుపై కూడా విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్ట్ కంపెనీలు – ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్, నవయుగ కూడా ప్రధాన కారణం.
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ నేరపూరిత నిర్లక్ష్యం ఉందని కమిషన్ తెలిపింది. బోర్డు సభ్యులు బాధ్యులు. రెవెన్యూ జనరేషన్, అంచనాల పెంపు వంటి అంశాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు.
వ్యాప్కోస్ సంస్థకు చెల్లించిన రూ.6.77 కోట్లు అధికారుల నుంచి వసూలు చేయాలి. మేడిగడ్డ 7వ బ్లాక్ పునరుద్ధరణ ఖర్చు ఎల్ అండ్ టీ భరించాలి. అన్నారం, సుందిళ్ల రిపేర్లు కాంట్రాక్ట్ కంపెనీలు చేయాలి.
కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్రంగా స్పందించారు. సోమవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ కీలక నాయకులతో ఆయన సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషన్ నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని విమర్శించారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. “ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. ఈ నివేదిక ముందే ఊహించినట్టే వచ్చింది. పార్టీ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొందరిని అరెస్ట్ చేయాలనుకుంటే చేయండి.. కానీ కాళేశ్వరం పనికిరాదని చెప్పేవాడు అజ్ఞాని. ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి. కాళేశ్వరం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలి. ఇకపై క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం’’ అని ఆయన నేతలతో చెప్పారు. ఈ భేటీలో హరీశ్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.