
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ ఈరోజు రాజన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గవర్నర్ తమిళిసై.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా, పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వేళ.. గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. హాట్ టాపిక్‌గా మారిన వేళ గవర్నర్ తమిళి సై ఆకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇటీవల ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే మర్యాదపూర్వకంగానే అమిత్ షాను కలిసినట్టుగా తమిళిసై చెప్పారు. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలోని అంశాలను అమిత్ షాకు గవర్నర్ తమిళిసై నివేదించారనే ప్రచారం జరిగింది.
ఇక, గత కొంతకాలంగా తెలంగాణలో రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్‌గా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు నెలల కిందట రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులు ప్రస్తుతం గవర్నర్ తమిళిసై వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అయితే యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై వివరణ కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌కు రావాల్సిందిగా గవర్నర్ తమిళిసై ఆహ్వానించారు. ఈ క్రమంలోనే పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని గవర్నర్ తమిళిసై అనుమానం వ్యక్తం చేశారు.
ఇక, గవర్నర్ తమిళిసై బీజేపీ నాయకురాలుగా వ్యవహరిస్తోంది అధికార టీఆర్ఎస్‌తో వామపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు ఇటీవలి కాలంలో కొందరు టీఆర్ఎస్ నేతలు, వారి సంబంధికులపై ఈడీ, ఐటీ దాడులు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.