ఖైరతాబాద్ గణనాథునికి తొలి పూజ.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని

Google News Follow Us

సారాంశం

తెలంగాణ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల శోభ సంతరించుకుంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ మహాగణపతి వద్ద భక్తుల సందడి నెలకొంది.

తెలంగాణ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల శోభ సంతరించుకుంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ మహాగణపతి వద్ద భక్తుల సందడి నెలకొంది. ఈరోజు ఖైరతాబాద్ గణనాథునికి తొలిపూజను వైభవంగా నిర్వహించారు. ఈ పూజలో తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళిసై సౌందర్‌రాజన్, బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం  నాగేందర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గణనాథునికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని  అన్నారు. తెలంగాణ ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని  వినాయకుడిని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. ఇది ఆధ్యాత్మిక ప్రదేశమని.. ఏర్పాట్లు చాలా బాగున్నాయని తెలిపారు. 

ఇక, ఖైరతాబాద్ గణనాథునికి పద్మశాలి సంఘం 125 అడుగుల కండువాను సమర్పించింది. అలాగే ఖైరతాబాద్ గణనాథునికి 75 అడుగుల గరికమాలను ఐఏఎస్ అధికారి వెంకటేష్ సమర్పించారు. ఇదిలాఉంటే, ఈ ఏడాది శ్రీ దశవిద్య మహాగణపతిగా ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. 63 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి.. ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి.