Hyderabad: ప్రగతి నిరోధక శక్తులకు తగిన గుణపాఠం చెప్పాలి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రజలకు పిలుపునిచ్చారు. ఐకమత్యమే మన బలమనీ, బంగారు తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతా దినోత్సవం నుంచి ఈ ప్రతిజ్ఞ ను తమ జీవితంలోకి తీసుకోవాలని అన్నారు.
Telangana CM KCR: తెలంగాణ ప్రగతి పథంలో పయనించేందుకు అడ్డంకులు సృష్టిస్తున్న అభ్యుదయ వ్యతిరేక శక్తులను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పిలుపునిచ్చారు. ప్రజల ఆశీస్సులతో తమ ప్రభుత్వం అభివృద్ధి ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఐకమత్యమే మన బలమని, బంగారు తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతా దినోత్సవం రోజు నుంచి ఈ ప్రతిజ్ఞను తమ జీవితంలోకి తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందనీ, తమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు, ఆశీస్సులు ఉండాలని కేసీఆర్ కోరారు.
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేసే ప్రక్రియను చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. అందులో భాగంగానే 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ భారత్ లో భాగమైంది. ఈ పరిణామంతో తెలంగాణలో నిరంకుశ పాలన అంతమై పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైందన్నారు. ప్రజాస్వామిక పాలన తీసుకురావడానికి యావత్ తెలంగాణ సమాజం పోరాటంలో పాలు పంచుకుందని ఆయన పేర్కొన్నారు. ప్రజా పోరాట ఘట్టాలు, సామాన్యుల త్యాగాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొంటూ స్వాతంత్య్ర సమరయోధులందరికీ నివాళులు అర్పించారు.
undefined
నాటి పాలకులు సమాజంలోని అన్ని వర్గాలను విశ్వాసంలోకి తీసుకుని నేడు మనం చూస్తున్న భారతదేశాన్ని నిర్మించారని కేసీఆర్ అన్నారు. మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దార్శనికత, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చతురత, ఎందరో నాయకుల అవిశ్రాంత కృషి దేశాన్ని ఏకం చేశాయన్నారు. భారత్ లో అంతర్భాగమైన తర్వాత 1948 నుంచి 1956 వరకు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగిందన్నారు. 1956లో రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రాంత ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందనీ, దాని దుష్పరిణామాలు మనందరికీ తెలుసన్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరిగిన తీవ్ర అన్యాయాల కారణంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం మొదలైందని కేసీఆర్ అన్నారు. ఉద్యమానికి నాయకత్వం వహించడం తనకు లభించిన గొప్ప అవకాశమనీ, అందరి మద్దతుతో విజయం సాధించానని చెప్పారు. కొత్త రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నిబద్ధత, ప్రజల ఆశీస్సులతో పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టానని కేసీఆర్ పేర్కొన్నారు. 2 జూన్ 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు. నూతన రాష్ట్రమైన తెలంగాణ అనుసరిస్తున్న విధానం సమగ్రంగా ఉందనీ, అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అభివృద్ధి నమూనా ఆదర్శవంతంగా ఉందన్నారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందడం వల్ల సంపద పెరిగిందనీ, అవసరమైన వారికి పంపిణీ చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.