మంత్రి హరీష్ రావును కలవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివరణ ఇచ్చారు. తన నియోజకవర్గంలో ఆసుపత్రి నిర్మాణం కోసం హరీష్ రావును కలిసినట్టుగా చెప్పారు.
హైదరాబాద్: బీజేపీలోనే బతుకుతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. శుక్రవారంనాడు తెలంగాణ మంత్రి హరీష్ రావును రాజాసింగ్ కలిశారు. ఈ విషయమై రాజాసింగ్ వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారుతానని సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీజేపీలోనే బతుకుతా.. బీజేపీలోనే చనిపోతానని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ మారే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
థూల్ పేటలో ఆసుపత్రి గురించి చర్చించేందుకు మంత్రి హరీష్ రావును కలిసినట్టుగా ఆయన వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ లో చేరేందుకు గాను తాను మంత్రి హరీష్ రావును కలిసినట్టుగా సాగుతున్న ప్రచారాన్ని రాజాసింగ్ తోసిపుచ్చారు. ఈ రకమైన ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
2022 ఆగష్టు మాసంలో రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ విధించింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ విధించింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను విధించాలని ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరారు. ఈ విషయమై ఆ పార్టీ నాయకత్వం సానుకూలంగా ఉందనే ప్రచారం సాగుతుంది. కానీ ఇంకా ఈ విషయమై ఆ పార్టీ నుండి స్పష్టత రాలేదు. ఇటీవలనే బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి కూడ రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా విజయశాంతి పార్టీ నాయకత్వాన్ని కోరారు.
also read:కారణమిదీ:హరీష్‌రావుతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. కిషన్ రెడ్డితో రాజాసింగ్ కు గతంలో గ్యాప్ ఉండేదనే ప్రచారం ఉండేది. దీనికి ఊతమిచ్చేలా కిషన్ రెడ్డి పై రాజాసింగ్ మీడియా వేదికగా గతంలో విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి తప్పుకున్న తర్వాత పార్టీ అధ్యక్ష పదవుల్లో ఉన్న డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్ లతో రాజాసింగ్ మంచి సంబంధాలు కొనసాగించారు.