
సిరిసిల్ల : ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని బ్రతకడమే జీవితం. నిరుపేదలకే కాదు అంబానీలు, అదానీలకు కూడా సమస్యలుంటాయి... ఆత్మహత్యే సమస్యకు పరిష్కారం అయితే ఈ భూమ్మీద మనుషులే వుండరు. ఈ నిజాన్ని గుర్తించలేక కొందరు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుని జీవితాన్ని అర్దాంతరంగా ముగిస్తున్నారు. ఇలా కన్నతల్లి కొట్టిందని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ వీడియో కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపడం కలకలం రేపుతోంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కమ్మరిపేట తండాకు చెందిన భూక్యా రాజు, జ్యోతి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు సంతానం. రెండో కొడుకు దినేష్(17)ను తల్లి కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయి ఇంట్లోకి బయటకు వెళ్లాడు. ఎక్కడో అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుంటున్నట్లు ఓ వీడియోను స్వయంగా రికార్డ్ చేసుకుని కుటుంబసభ్యులకు పంపాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చేపట్టారు.
ఆత్మహత్యకు ముందు కన్నీరు పెట్టుకుంటూ బాధనంతా వీడియో ద్వారా బయటపెట్టాడు దినేష్. అమ్మ కొట్టడం తననెంతో బాధించిందని అతడు తెలిపారు. పుడితే గొప్పింట్లో పుట్టాలి... ఈ కుక్క బ్రతుకు ఇక బ్రతకలేనంటూ బాధపడ్డాడు. చెల్లి పెళ్లి చేసే సమయంలో తన ఫోటో ముందుపెట్టాలని దినేష్ తల్లిదండ్రులను కోరాడు. కుటుంబసభ్యులు, స్నేహితుల పేర్లను గుర్తుచేసుకుంటూ బాలుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బాలుడు పంపిన సెల్పీ వీడియో కలకలం రేపుతోంది.
Read More హైదరాబాద్ లో కన్నడ యువతి సూసైడ్.... కేబుల్ బ్రిడ్జి పైనుండి దుర్గంచెరువులో దూకి
నేను ఆత్మహత్య చేసుకున్నా మృతదేహం దొరకడానికి పదిరోజులైనా పడుతుందని బాలుడు వీడియోలో చెప్పడం... దట్టమైన చెట్లమధ్యలో బాలడు కనిపించడంతో అతడేదో అడవిలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కమ్మరెడ్డిపేట తండా చుట్టుపక్కల అటవీప్రాంతంలో దినేష్ ఆఛూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులే కాదు కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా దినేష్ కోసం వెతుకుతున్నారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)