పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షకు హాజరయ్యేందుకు ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ ప్రకటించింది. దీని వల్ల పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు లేటుగా వచ్చినా.. విద్యార్థులను అనుమతిస్తారు.
పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిషం నిబంధనను ఎత్తివేసింది. పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ ను ప్రకటించింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షల జరగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మేలు జరగనుంది.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన గ్రేస్ టైమ్ వల్ల విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు, సైన్స్ సబ్జెక్టులు మినహా మిగిలిన వారికి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు, పార్ట్-1 ఫిజికల్ సైన్స్, పార్ట్-2 బయోలాజికల్ సైన్స్ పరీక్షలు రెండు రోజుల్లో ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు సహా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పరీక్షల పర్యవేక్షణకు విద్యాశాఖ, రెవెన్యూ శాఖలకు చెందిన ఒక్కో అధికారి, ఒక ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన 144 ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించనున్నారు.
ఐదు నిమిషాల వరకు గ్రేస్ టైమ్ పరీక్షల అన్ని రోజులకు వర్తిస్తుందని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశామమని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ.కృష్ణారావు 'ఈనాడు'కు తెలిపారు. ఈసారి అన్ని కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు తప్పుడు ప్రశ్నపత్రాలు జారీ చేస్తే ఇన్విజిలేటర్లను బాధ్యులను చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందని తెలిపారు. పరీక్షార్థులు లేవనెత్తిన సందేహాలు, అభ్యంతరాలపై పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ నుంచి వివరణ తీసుకోవాలని ఇన్విజిలేటర్లను ఆదేశించారు. తప్పుడు ప్రశ్నపత్రాల జారీకి బాధ్యులైన వారిని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాలు, అన్యాయ మార్గాల నిరోధక) చట్టం-1997 ప్రకారం శిక్షిస్తామని అధికారులు తెలిపారు.