రెండు గంటలుగా దంచికొడుతోన్న వర్షం.. రోడ్లపైకి భారీగా వరద నీరు, హైదరాబాద్‌కు హైఅలర్ట్

Siva Kodati |  
Published : Oct 08, 2022, 07:19 PM IST
రెండు గంటలుగా దంచికొడుతోన్న వర్షం.. రోడ్లపైకి భారీగా వరద నీరు, హైదరాబాద్‌కు హైఅలర్ట్

సారాంశం

హైదరాబాద్‌లో రెండు గంటలుగా పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని మళ్లించే ఏర్పాట్లు చేస్తున్నాయి. 

హైదరాబాద్‌లో రెండు గంటలుగా పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్‌లలో భారీ వర్షం పడుతోంది. పంజాబ్, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, యూసుఫ్‌గూడలలోనూ వర్షం దంచి కొడుతోంది. దీంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. భారీ వర్షానికి రోడ్లపైకి వర్షపు నీరు చేరుకుంది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని మళ్లించే ఏర్పాట్లు చేస్తున్నాయి. 

ఇకపోతే... కొన్నిరోజులుగా తెలంగాణ‌లో ఎడతెరిపి లేకుండా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, అనేక చెరువులు, జ‌లాశ‌యాలు నీటితో నిండిపోయాయి. కొన్ని ప్రదేశాలలో వాగులు వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. మ‌రో ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. అక్టోబర్ 12 వరకు ఒక మోస్తరు ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షంతో పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ విభాగం పేర్కొంది. 

ALso Read:వనపర్తి : అదుపుతప్పి బైక్‌తో సహా వాగులోకి... ముగ్గురు గల్లంతు

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు రాత్రిపూట వర్షం కొనసాగుతుండటంతో నివాసితులను, ముఖ్యంగా యువకులు, వృద్ధులు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. వాగులు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న తీగల చుట్టూ తిరగకుండా ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు కోరారు. ఏదైనా దురదృష్టకర పరిస్థితులు ఏర్పడితే 100కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. వనపర్తి ప్రాంతంలో గోపాల్‌పేట, బుద్దారం వెళ్లే రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం గ‌ణ‌నీయంగా పెరిగింది.

వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో శిథిలావస్థలో ఉన్న భవనాల్లోని నివాసితులు ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెంలోని అంకంపాలెంలో అత్యధికంగా 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంలోని అశ్వారావుపేటలో 15.8 మిల్లీ మీట‌ర్లు, నల్గొండలోని జునూట్లలో 22.3 మిల్లీ మీట‌ర్ల వ‌ర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ (IMD) శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో శనివారం తేలికపాటి నుండి మోస్తరుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏజెన్సీ ప్రకారం, రాబోయే ఐదు రోజులలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

ఉస్మాన్ సాగర్ & హిమాయత్ సాగర్ గేట్ల ఎత్తివేత‌

మరోవైపు... హైదరాబాద్‌లో బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్లు ఫుల్ ట్యాంక్ లెవల్స్ (ఎఫ్‌టిఎల్)కి చేరుకోవడంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యుఎస్&ఎస్‌బీ) శుక్రవారం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను రెండు అడుగుల వరకు తెరిచింది. ఉస్మాన్ సాగర్ గరిష్ట సామర్థ్యం 1,790.00 అడుగుల వద్ద కొలిచిన తర్వాత రెండు గేట్లను తెరిచారు. అలాగే, హిమాయత్ సాగర్ వద్ద, నీటి మట్టం 1,763.50 అడుగుల పూర్తి ట్యాంక్ లెవెల్ (FTL) వద్ద కొలవబడింది. ఈ క్ర‌మంలోనే అధికారులు రిజర్వాయర్ రెండు గేట్లను తెరిచారు. ఇన్ ఫ్లో 1800 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2060 క్యూసెక్కులుగా ఉంది. రిజర్వాయర్‌లోని మూడు గేట్లను రెండు అడుగుల మేర తెరిచారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?