Omicron: ఇక నుంచి గాంధీ హాస్పిటల్‌లోనూ జీనోమ్ సీక్వెన్సింగ్.. ఒమిక్రాన్ నిర్ధారణ

By Mahesh K  |  First Published Dec 21, 2021, 5:28 AM IST

హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లోనూ ఇక నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి రానున్నట్టు సీనియర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సీడీఎఫ్‌డీ, సీసీఎంబీల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతున్నది. ఈ రెండు సంస్థల నుంచే గాంధీ సిబ్బంది జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడంపై శిక్షణ పొందారు. గాంధీలోనూ జీనోమ్ సీక్వెన్సింగ్ సదుపాయం అందుబాటులోకి రావడంతో ఒమిక్రాన్ నిర్ధారణ సమయం కొంత తగ్గనుంది.
 


హైదరాబాద్: కరోనా కేసులు(Corona Cases) క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) భయాలూ నెలకొంటున్నాయి. అయితే, కేసుల స్థాయిలో జీనోమ్ సీక్వెన్సింగ్(Genome Sequencing) చేసి ఒమిక్రాన్ వేరియంట్‌ను నిర్ధారించడం ప్రయాసతో కూడుకున్న పనిగా ఉన్నది. జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే ల్యాబ్‌లు పరిమిత సంఖ్యలో ఉండటం.. సుశిక్షితులైన సిబ్బంది కొరత కారణంగా ఒమిక్రాన్ వేరియంట్ నిర్దారణ సమయమూ ఎక్కువగానే ఉన్నది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లోనే ఇకపై జీనోమ్ సీక్వెన్సింగ్ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

కరోనా వైరస్ ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో గాంధీ హాస్పిటల్ భారీ సంఖ్యలో టెస్టు చేపట్టింది. కరోనా కేసుల నిర్దారణలో కీలక పాత్ర పోషించింది. తాజాగా, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ చేస్తున్నారు. రాజధాని నగరంలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనూ విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల శాంపిళ్లు ఎక్కువగానే వస్తున్నాయి. కానీ, వాటి జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాల కోసం ఎక్కువ కాలం ఎదరుచూడక తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే గాంధీ హాస్పిటల్‌లోనే జీనోమ్ సీక్వెన్సింగ్ వసతిని అందుబాటులోకి తెచ్చారు. తద్వార శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చిన వారి శాంపిళ్లను ఇక్కడే జీనోమ్ సీక్వెన్సింగ్ చేయనున్నారు. దీంతో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నోస్టిక్స్(సీడీఎఫ్‌డీ), సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ(సీసీఎంబీ)తోపాటు గాంధీ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వచ్చింది.

Latest Videos

undefined

Also Read: Gujarat స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ప్రధాన నగరాల్లో night curfew

గాంధీలో జీనోమ్ సీక్వెన్సింగ్ సదుపాయం అందుబాటులోకి రావడంతో సీడీఎఫ్‌డీ, సీసీఎంబీలపై భారం కొంత తగ్గనుంది. అలాగే, ఒమిక్రాన్ ఫలితాల కోసం ఎదురుచూసే కాలమూ తగ్గనుంది. జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడానికి గాంధీ హాస్పిటల్ సిబ్బంది కొందరు సీడీఎఫ్‌డీ, సీసీఎంబీలలో శిక్షణ పొందారు. కరోనా టెస్టుల సమయంలోనూ ఈ సంస్థల నుంచి గాంధీ సిబ్బంది ట్రైనింగ్ తీసుకున్నారు.

గతంలో లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే కూడా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. డెల్టా వేరియంట్ కంటే కూడా ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఇప్పుడు లభిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు.

అంతేకాదు, ఈ వేరియంట్ టీకా వేసుకున్నవారికీ సులువుగానే సోకవచ్చునని ఆయన వెల్లడించారు. ఇప్పటికే కరోనా బారిన పడినవారికీ సోకే ముప్పు ఉన్నదని తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్టు ఈ వేరియంట్ గురించి మాట్లాడుతూ, ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ఈ వేరియంట్ విజయవంతంగా ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు బూస్టర్ డోసుల పంపిణీ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేశాయి. కొన్ని దేశాలు ఇప్పటికే బూస్టర్ డోసులు అందించడాన్ని ప్రారంభించాయి. కాబట్టి, అలాంటి దేశాలు ముందుగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సూచనలు చేశారు. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని టీకాలూ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను నిలువరించలేవు అని చెప్పలేమని పేర్కొన్నారు.

click me!