పోలీస్ అవతారం, అత్యాధునిక కార్లలో గంజాయి సరఫరా: ముఠా గుట్టు రట్టు చేసిన హైద్రాబాద్ పోలీసులు

By narsimha lode  |  First Published Aug 17, 2023, 1:12 PM IST

డ్రగ్స్, గంజాయిని సరఫరా చేస్తున్న  ఏడుగురిని  హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.  రెండు గ్రూపుల సభ్యుల గురించి  హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వివరించారు.


హైదరాబాద్: అత్యాధునిక కార్లలో  గంజాయిని తరలిస్తున్న  ఆరుగురిని  అరెస్ట్ చేసినట్టుగా  హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. మరో వైపు డ్రగ్స్ సరఫరా చేస్తున్న  డేవిడ్ సన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ తెలిపారు.  

గురువారంనాడు హైద్రాబాద్ సీపీ  సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు.  హైద్రాబాద్ నగరంలో  డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న వారిని  పోలీసులు అరెస్ట్  చేశారు.ఈ ముఠాలకు సంబంధించిన వివరాలను  సీపీ ఆనంద్   మీడియాకు వివరించారు.

Latest Videos

హైద్రాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను అరెస్ట్  చేసినట్టుగా సీపీ  చెప్పారు.  మరో వైపు గంజాయిని సరఫరా చేస్తున్న మరో ఆరుగురు సభ్యుల ముఠాను  కూడ అరెస్ట్ చేసినట్టుగా సీపీ వివరించారు.

నైజీరియన్ వద్ద రూ. 11 లక్షల విలువైన  ఎండీఎంఏను సీజ్  చేసినట్టుగా సీపీ  చెప్పారు. 


మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం ఏపూరు గ్రామానికి చెందిన వంకుడోతు వీరన్న గంజాయి సరఫరాలో  కీలక నిందితుడిగా సీపీ  చెప్పారు.ఎస్ఎస్‌సీ ఫెయిలైన  వీరన్న  హైద్రాబాద్ కు వచ్చి ఆటో డ్రైవర్ గా  పనిచేసేవాడని సీపీ చెప్పారు. అయితే  2009లో ఎస్ఎస్‌సీ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యారన్నారు.ఆ తర్వాత ఆయన డిప్లోమాను  పూర్తి చేసినట్టుగా సీపీ తెలిపారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక  కొంతకాలంపాటు  హెచ్‌డీఎఫ్‌సీ, నారాయణ టెక్నో స్కూల్ లో  కొంతకాలం పాటు పనిచేశాడన్నారు. తన జీవనభృతికి  వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో గంజాయి సరఫరా వైపు మళ్లినట్టుగా సీపీ  చెప్పారు. 

సూర్యాపేట జిల్లాలోని  దానంచర్ల తండాకు చెందిన వీరన్న మేనమామ వద్దకు  చేరాడు. వీరన్న మేనమామ అప్పటికే గంజాయి  సరఫరాలో కీలకంగా ఉన్నాడని  సీపీ చెప్పారు. తన మేనమామ గంజాయి సరఫరా చేసే వాహనాన్ని వీరన్న నడిపేవాడని తమ విచారణలో గుర్తించినట్టుగా  సీపీ  తెలిపారు.విశాఖకు చెందిన సోమరాజు గంజాయి పండించే  వ్యక్తితో  వీరన్న సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా సీపీ  ఆనంద్ చెప్పారు.  వారానికి రెండుసార్లు విశాఖకు వెళ్లి వంద కిలోలు గంజాయిని తీసుకువచ్చేవాడని  సీపీ చెప్పారు.

గంజాయి విక్రయం ద్వారా  వచ్చిన ఆదాయంతో ఆధునాతనమైన  కార్లను  వీరన్న కొనుగోలు చేశారు. అయితే ఈ కార్లలో గంజాయి తరలించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఏర్పాట్లను  చేసినట్టుగా సీపీ ఆనంద్ తెలిపారు.పోలీస్ అధికారిగా వీరన్న  వ్యవహరించేవాడన్నాడు.  నకిలీ పోలీస్ అధికారిగా గుర్తింపు కార్డులు తయారు చేసుకున్నట్టుగా  గుర్తించినట్టుగా  చెప్పారు.  వీరన్న ఉపయోగించే వాహనాలకు కూడ పోలీసుల సైరన్లు వాడేవాడన్నారు.   టోల్ గేట్లు, చెక్ పోస్టుల వద్ద  తాను పోలీసు అధికారినని నమ్మించి గంజాయిని తన కార్లలో తరలించేవాడని  సీపీ చెప్పారు. 

also read:హైద్రాబాద్ లో భారీగా డ్రగ్స్ సీజ్: ఆరుగురు అరెస్ట్

హైద్రాబాద్ నుండి  ఈ వాహనాలను   మహారాష్ట్ర వరకు  తన వద్ద పనిచేసే ముగ్గురు డ్రైవర్లతో పంపేవాడు. అయితే  మహారాష్ట్రకు  వీరన్న ఫ్లైట్ లో  వెళ్లేవాడని  సీపీ చెప్పారు.మహరాష్ట్రలోని  నిఖిలేష్ కు  కిలో గంజాయి  రూ. 25 వేలకు విక్రయించినట్టుగా  తమ దర్యాప్తులో గుర్తించినట్టుగా  సీపీ వివరించారు.  వీరన్నకు  సహకరించిన వారిని గుర్తించామన్నారు.   వీరిలోన కొందరు  పోలీస్ శాఖలో పనిచేసేవారున్నారన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా  సీపీ ఆనంద్ చెప్పారు. మరో వైపు  హైద్రాబాద్ ఫిల్మ్ నగర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న డేవిడ్ సన్ ను అరెస్ట్ చేసినట్టుగా  ఆయన చెప్పారు. బెంగుళూరు కేంద్రంగా  దక్షిణ భారత్ లో డేవిడ్ సన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా  సీపీ వివరించారు.

click me!