వివిధ రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నా ఘరానా స్మగ్లర్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసారు.
హైదరాబాద్ : ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాగ్ డ్రాప్ లో వచ్చిన ప్యాన్ ఇండియా మూవీ 'పుష్ఫ' అందరూ చూసే వుంటారు.ఇందులో హీరో అల్లు అర్జున్ పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేందుకు సరికొత్త టెక్నిక్స్ వాడుతుంటారు. ఇలా పుష్పరాజ్ రీల్ స్మగ్లర్ అయితే రియల్ గా ఇలాంటి ఆలోచనలే కలిగిన గంజాయి స్మగ్లర్ పోలీసులకు చిక్కాడు. సరుకు రవాణా లారీని గంజాయి స్మగ్లింగ్ కోసం సరికొత్తగా తీర్చిదిద్దాడు సదరు స్మగ్లర్. అయితే అతడికంటే స్మార్ట్ గా ఆలోచించిన తెలంగాణ పోలీసులు ఆ లారీ గుట్టును కనిపెట్టి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రాచకొండ పోలీస్ కమీషనర్ డీఎస్ చౌహాన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ కు చెందిన సుభాష్ బిష్ణోయ్ లారీ డ్రైవర్. ఈ పని చేయడంద్వారా వచ్చే డబ్బులు అతడి జల్సాలకు సరిపోకపోవడంతో గంజాయి స్మగ్లర్ గా మారాడు. ఒడిషా నుండి రాజస్థాన్ కు గంజాయి తరలించడం ప్రారంభించాడు. అయితే వివిధ రాష్ట్రాల మీదుగా గంజాయిని తరలించాల్సి రావడం... ఆయా రాష్ట్రాల్లో, చెక్ పోస్టులలో పోలీసులు తనిఖీలు ఎక్కువగా వుండటంతో తప్పించుకోడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు.
undefined
సరుకు రవాణా లారీ క్యాబిన్ వెనకాల ఎవరికీ అనుమానం రాకుండా రహస్య అరను ఏర్పాటుచేయించుకున్నాడు. ఇందులో గంజాయిని పెట్టి సరుకుతో పాటు తరలించేవాడు. ఇలా ఒడిషా నుండి ఆంధ్ర, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలమీదుగా ప్రయాణించి రాజస్థాన్ కు చేరుకునేవాడు. ఇలా ఒక్కో ట్రిప్పుకు వందల కిలోల గంజాయిని పెడ్లర్ల వద్దకు చేర్చడంద్వారా వేల రూపాయల కమీషన్ గా పొందేవాడు.
ఇలా సరికొత్తగా తీర్చిదిద్దిన లారీలో 710 కిలోల గంజాయిని తరలిస్తుండగా తెలంగాణ ఎస్వోటీ పోలీసులు తనిఖీ చేసారు. హైదరాబాద్ శివారులో లారీని ఆపిన పోలీసులు అనుమానంతో క్షుణ్షంగా పరిశీలించగా క్యాబిన్ వెనకాల రహస్య అర వున్నట్లు గుర్తించారు. దీంతో దాన్ని తెరిచిచూడగా భారీగా గంజాయి ప్యాకెట్లు కనబడ్డాయి. వెంటనే గంజాయిని స్వాధీనం చేసుకుని సుభాష్ బిష్ణోయ్ ను అరెస్ట్ చేసారు.
ఈ గంజాయి స్మగ్లింగ్ పై దర్యాప్తు చేస్తున్నామని... ఇందులో ప్రమేయమున్న మిగతావారిని కూడా అరెస్ట్ చేస్తామని రాచకొండ సిపి చౌహాన్ తెలిపారు. సినిమా స్టైల్లో జరుగుతున్న ఈ గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు చేసిన పోలీసులను సిపి అభినందించారు.