బీజేపీ, కాంగ్రెస్‌ల పట్ల ముస్లింలు అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి కేటీఆర్

By Sumanth Kanukula  |  First Published Oct 31, 2023, 9:59 AM IST

దేశంలో కుల, మతాల ప్రాతిపదికన మనుషులను విడదీసిన ఘనత కాంగ్రెస్‌, బీజేపీలకే దక్కుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.


దేశంలో కుల, మతాల ప్రాతిపదికన మనుషులను విడదీసిన ఘనత కాంగ్రెస్‌, బీజేపీలకే దక్కుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ముస్లింలను బీజేపీ, కాంగ్రెస్‌లు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నాయని.. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండు పార్టీలు కూడా దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా  ఉంటూ.. వారి రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశంలో మత రాజకీయాలు చేశాయని మండిపడ్డారు. పార్లమెంట్‌ సాక్షిగా దేశంలోని ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలు మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నాయని.. ఈ ఎన్నికల్లో మతాల ప్రాతిపదికన ప్రజలను విడదీసి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి ముస్లిం సమాజం వారిని వారు రక్షించుకోవాలని అన్నారు. 

Latest Videos

గాంధీభవన్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం నిండిన గాడ్సే దూరాడని అన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు బీజేపీ తీవ్రంగా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో గత తొమ్మిదిన్నరేళ్లలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ లేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ బీజేపీకి బీ టీం కాదని అన్నారు. తాము పేదోడి పక్షాన నిలిచే నిఖార్సైన లౌకికవాది కేసీఆర్‌ నాయకత్వంలో పాలన చేస్తున్నామని చెప్పారు. 

మైనార్టీల ఓట్ల కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటేనంటూ కాంగ్రెస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ముస్లింలు గ్రహించాలని కోరారు. తెలంగాణ తరహాలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మైనార్టీలకు సంక్షేమ పథకాలు అమలుకావడంలేదని చెప్పారు. దేశంలో కేసీఆర్ లాంటి నాయకుడు లేడని, ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని కోరారు. 

click me!