కేసిఆర్ సర్కార్ కు షాక్ ఇచ్చిన గజ్వేల్ పంతులు

First Published Sep 6, 2017, 11:18 PM IST
Highlights
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును తిరస్కరించిన గజ్వేల్ టీచర్
  • విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న సర్కారీ పురస్కారం వద్దన్న పంతులు
  • కేజి టు పిజి విద్య అందించడంలేదని ఆవేదన

గజ్వేల్ పంతులు ఒకాయన తెలంగాణ సిఎం కేసిఆర్ సర్కారుకు షాక్ ఇచ్చారు. అది కూడా ఉపాధ్యాయ దినోత్సవం నాడు జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ పంతుళ్లను ప్రభుత్వాలు సన్మానించడం తెలిసిందే.

గజ్వేల్ మండలంలోని 11 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించాలని నిర్ణయించారు. గురుపూజోత్సవం నాడు వారందరినీ గజ్వెల్ లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ దామోదర్ రెడ్డి, ఎంఇఓ సునీత ఆధ్వర్యంలో సన్మానించేందుకు రెడీ అయ్యారు. దీనికి ఎంపిపి చిన్నమల్లయ్య, గజ్వేల్ ప్రజాపూర్ నగర పంచాయతీ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎమ్మార్వో భిక్షపతి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో ఏడుగురు పంతుళ్లకు సన్మానం జరిగింది. ఆ తర్వాత గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని క్యాసారం ప్రాథమిక పాఠశాలలో ఎస్ జిటి గా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అక్కారం సత్తయ్యను సన్మానించేందుకు వేదికపైకి పిలిచారు. దీంతో తనకు ఆ సన్మానం వద్దని సత్తయ్య తిరస్కరించారు.

60 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యారంగం నిర్వీర్యమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేజి టు పిజి ప్రభుత్వ విద్యను అందిస్తామని ప్రకటించిన టిఆర్ఎస్ ఆచరణలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చచేశారు. తెలంగాణ సర్కారు చర్యలతో పేద గిరిజన, దళిత, బడుగు, మైనార్టీ పిల్లలు చదువుకు దూరమవుతున్నారని అన్నారు.

విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ సర్కారు చేసే సన్మానం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఆయన తేల్చి చెప్పారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి సత్తయ్య వెళ్లిపోయారు. ఆయన అలా మాట్లాడే సరికి అక్కడున్న పెద్దలంతా షాక్ తిన్నారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత మిగతా పంతుళ్లను సన్మానించారు. ఈ సంఘటన జిల్లాతోపాటు విద్యారంగంలో చర్చనీయాంశమైంది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

click me!