వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. మావోయిస్టులను అడవులో నుండి తీసుకువచ్చి జాగ్రత్తగా అడవులో దింపడంలో గద్దర్ కీలకంగా వ్యవహరించారు.
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టుల(నక్సలైట్లు)తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చర్చలు జరుపుతామని ప్రకటించింది. ఆనాడు హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్చలకు మావోయిస్టులను చర్చలకు ఆహ్వానం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులను చర్చలకు ఆహ్వానం పలికింది. ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్టులు అడవుల నుండి హైద్రాబాద్ కు వచ్చారు. మావోయిస్టు పార్టీ అప్పటి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఓబీ సెక్రటరీ సుధాకర్, గాజర్ల రవి అలియాస్ గణేష్ లు హైద్రాబాద్ కు వచ్చారు.
2004 అక్టోబర్ 11న ప్రకాశం జిల్లా చిన్నఆరుట్ల గ్రామం వద్ద నల్లమల అటవీ ప్రాంతం నుండి మావోయిస్టులు, జనశక్తి నేతలు బయటకు వచ్చారు. గద్దర్ నేతృత్వంలోని బృందం వారిని సురక్షితంగా హైద్రాబాద్ కు తీసుకు వచ్చింది. 2004 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చల సమయంలోనే మావోయిస్టు అగ్రనేత హైద్రాబాద్ లో కంటి పరీక్షలు చేయించుకున్నారు. హైద్రాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇరువర్గాల మధ్య చర్చలు సానుకూల దృక్పథంలో జరిగాయి. కొన్ని విషయాల్లో మాత్రం ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే చర్చలు కొనసాగించాలని భావించాయి. కాల్పుల విరమణ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంతో చర్చలు ముగిసిన తర్వాత మావోయిస్టులను గద్దర్ అడవుల్లోకి తీసుకెళ్లి వదిలిపెట్టాడు.
also read:గద్దర్ మరణం.. ‘ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది’.. ఆర్ నారాయణ మూర్తి, చిరంజీవి, బాలకృష్ణ, తారక్ నివాళి
అయితే ప్రభుత్వం తరపున చర్చలకు వచ్చిన జనశక్తి నేత రియాజ్ ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. ఆ తర్వాత కొన్ని చోట్ల ఎన్ కౌంటర్లు జరిగాయి. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు పూనుకున్నాయి.