తెలంగాణ బీజేపీకి మరో షాక్.. అధ్యక్ష బాధ్యతలకు కిషన్ రెడ్డి విముఖత? పదవిపై మాట్లాడటానికి నిరాకరణ

By Mahesh K  |  First Published Jul 4, 2023, 7:05 PM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలపై కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి విముఖతగానే ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియామకం కావడంపై స్పందన కోరగా.. ఆయన మాట్లాడకుండానే మీడియా నుంచి దూరంగా వెళ్లిపోయారు. మొదటి నుంచి ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవిపై విముఖతగానే ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
 


హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో గందరగోళం ఇవ్వాళ్టి ప్రకటనలతో కనుమరుగవుతుందని అంతా ఆశించారు. సౌమ్యుడు, అందరితోనూ సత్సంబంధాలు కలిగిన జీ కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పార్టీ అంతర్గత వర్గాలు సమసిపోతాయని, నేతలు ఒక్క తాటి మీదికి  వస్తారనే చర్చ జరిగింది. కానీ, కిషన్ రెడ్డి అసలు ఆ అధ్యక్ష పదవిని ఇంకా అంగీకరించలేదా? హైకమాండ్ చెప్పినా ఆయన కన్విన్స్ కాలేదా? ఆయన ఇంకా తన పట్టువీడలేదా? అంటే ఔననే ఆయన నడుచుకున్న తీరు చూస్తే అనిపిస్తుంది.

ఈ రోజు ఆయన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఈ కార్యక్రమంలో ఉండగానే బీజేపీ అధిష్టానం ఆయనను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. దీంతో మీడియా ఆయనను ఈ విషయంపై స్పందించాలని కోరింది. కానీ, ఆయన స్పందించ నిరాకరించారు. ఏమీ మాట్లాడకుండా ఆయన హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు. దీంతో ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలపై సుముఖంగా లేరని తెలుస్తున్నది.

Latest Videos

తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పు చర్చ మొదలైనప్పటి నుంచి కిషన్ రెడ్డినే బండి సంజయ్ స్థానంలో నియామకం అవుతారనే సమాచారం బయటకు వచ్చింది. కానీ, ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగడంపైనే సుముఖత వ్యక్తం చేసినట్టూ తెలిసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు సున్నితంగా తిరస్కరిస్తూ అధిష్టానానికి చెప్పినట్టూ వార్తలు వచ్చాయి. 

Also Read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్ట్రాటజీ ఖరారైనట్టేనా?

అయితే, తాజాగా బీజేపీ అధిష్టానం ఆయనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రకటించడంతో బహుశా జీ కిషన్ రెడ్డిని హైకమాండ్ కన్విన్స్ చేసి ఉండొచ్చని, ఆయన కూడా ఎట్టకేలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి అంగీకరించి ఉండొచ్చనే అభిప్రాయాలు వచ్చాయి. కానీ, కిషన్ రెడ్డి ఈ నియామకంపై మౌనం దాల్చడం అనేక సందేహాలకు తెరతీస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు, అసంతృప్తులకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదని అర్థం అవుతున్నది.

click me!