హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ వర్గం వారి ప్రార్ధనలు ప్రశాంతంగా ముగిశాయి. సామూహిక ప్రార్ధనలను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో శుక్రవారం నాడు ఓ వర్గం వారి ప్రార్ధనలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రార్థనలు ముగిసిన తర్వాత కొందరు యువకులు నినాదాలు చేసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించారు. సాధారణంగా ప్రతి శుక్రవారం నాడు ప్రార్ధనలకు వచ్చే వారి కంటే తక్కువ మంది ఇవాళ ప్రార్ధనలకు వచ్చారు. ప్రార్ధనలు ముగిసిన తర్వాత తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
శుక్రవారం నాడు పాతబస్తీలోని మక్కా మసీదు, శాలిబండ, మొఘల్ పురాల్లో సామూహిక ప్రార్ధనలు జరుగుతాయి. ఈ ప్రార్ధనల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. దీంతో పాతబస్తీలో సుమారు 4 వేలకు పైగా మందితో పోలీసులు ఇవాళ బందోబస్తును ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ పోర్స్, టాస్క్ ఫోర్స్, క్విక్ యాక్షన్ ఫోర్స్ వంటి బలగాలు పాతబస్తీలో భద్రతను ఏర్పాటు చేశారు.
undefined
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పీడీయాక్ట్ పై పోలీసులు నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. దీంతో ఇవాళ ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకోవాలని హైద్రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. ఓ వర్గం మత పెద్దలతో పోలీసులు నిన్న రాత్రి చర్చలు జరిపారు. మత పెద్దల పిలుపుతో పాటు అసద్ పిలుపు మేరకు ప్రశాంతంగా ప్రార్ధనలు ముగిశాయి.
also read:రాజాసింగ్ అరెస్ట్: హైద్రాబాద్ పాతబస్తీలో పోలీసుల హైఅలెర్ట్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియాలో వీడియోను అప్ లోడ్ చేయడంతో హైద్రాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఎంఐఎం ఆరోపణలు చేసింది. అయితే తాను ఎవరి పేరును ప్రస్తావిస్తూ కించపర్చేలా వ్యాఖ్యలు చేయలేదని రాజాసింగ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలని ఈ నెల 22వ తేదీ రాత్రి నుండి 23వ తేదీ ఉదయం వరకు ఎంఐఎం ఆందోళనకు దిగింది. దీంతో ఈ నెల 23న రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం రాజాసింగ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2004 నుండి రాజాసింగ్ పై నమోదైన కేసులను పురస్కరించుకొని రాజాసింగ్ పై పీడీయాక్ట్ ను నమోదు చేశారు. నిన్న మద్యాహ్నం రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.