నకిలీ వకీల్... ఏకంగా కోర్టు ఉత్తర్వులనే సృష్టించి బురిడీ

By Arun Kumar PFirst Published Jan 14, 2021, 2:11 PM IST
Highlights

 ఇటీవల శివరాజ్ తమకిచ్చిన కోర్టు ఉత్తర్వులు నకిలీవని తేలడంతో శ్యాంసుందర్‌ ఎల్బీ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. 

హైదరాబాద్: ఏకంగా కోర్టు ఉత్తర్వులనే సృష్టించి ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి డబ్బులు వసూలు చేసిన నకిలీ వకీల్ సాబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీ నగర్ పోలీసులు బుధవారం ఈ నకిలీ న్యాయవాదిని కోర్టులో హాజరుపర్చారు. 

వివరాల్లోకి వెళితే...కర్ణాటక రాయచూర్ కు చెందిన శివరాజ్(55) ఉపాధినిమిత్తం హైదరాబాద్ కు వచ్చి సైదాబాద్ లో నివాసముంటున్నాడు. అయితే ఈజీగా మనీ సంపాదించడానికి న్యాయవాది అవతారం ఎత్తాడు. ఈ క్రమంలోనే శ్యాంసుందర్ అనే వ్యక్తిని న్యాయవాదిగా నమ్మించి మోసానికి పాల్పడ్డాడు.

దిల్‌సుఖ్‌నగర్‌ కు చెందిన శ్యాంసుందర్‌కు చెంగిచర్లలో ఓపెన్‌ ప్లాట్లు, శైలజ ప్రిమియర్‌ అపార్టుమెంట్‌కు సబంధించిన షాపులు ఉన్నాయి. అయితే ఈ ఆస్తులకు సంబంధించి వివాదాలు వుండటంతో అతడు శివరాజ్ నిజంగానే లాయర్ గా భావించి సంప్రదించాడు. దీంతో పలుమార్లు అతడి నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి కొన్నాళ్లకు ఈ కేసుకు సంబంధించి నకిలీ కోర్టు ఉత్తర్వులు సృష్టించి ఇచ్చా డు. 

అయితే ఇటీవల శివరాజ్ తమకిచ్చిన కోర్టు ఉత్తర్వులు నకిలీవని తేలడంతో శ్యాంసుందర్‌ ఎల్బీ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలంగాణ హైకోర్టు బార్‌కౌన్సిల్‌ను సంప్రదించారు. దీంతో శివ్‌రాజ్‌ న్యాయవాది కాదని తేలింది. దీంతో నిందితుడు శివ్‌రాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
 

click me!