విషాదం : నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి.. తీవ్రగాయాలతో చిన్నారి మృతి..

By SumaBala Bukka  |  First Published Feb 21, 2023, 9:57 AM IST

వీధి కుక్కల దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన అంబర్ పేటలో విషాదం నింపింది. మూకుమ్మడిగా దాడిచేసి చిన్నారిని తీవ్ర గాయాలపాలు చేయడంతో మరణించాడు. 


హైదరాబాద్ : హైదరాబాదులోని అంబర్పేటలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. ఓ నాలుగేళ్ల చిన్నారిని వీధి కుక్కలు వెంటపడి కరిచి చంపాయి. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి మృతితో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.  హైదరాబాదులోని అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెలవు రోజు కావడంతో తండ్రితో కలిసి కొత్త ప్రాంతానికి వచ్చిన ఆ చిన్నారి..  వీధికుక్కలు వెంట పడడంతో భయంతో పరుగులు పెట్టి..  చివరికి  వటి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి డిఏ ప్రభాకర్, అడ్మిన్ ఎస్ఐ మల్లేశం తెలిపిన వివరాలు ఈ మేరకు ఉన్నాయి.

గంగాధర్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందినవాడు. నాలుగేళ్ల క్రితం హైదరాబాదుకు ఉపాధి నిమిత్తం వలస వచ్చాడు. అంబర్పేట్ ఛే నెంబర్ చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు.. ఒక కుమార్తె (6), ఒక కొడుకు ప్రదీప్ (4) ఉన్నారు. గంగాధర్, భార్య జనప్రియ పిల్లలతో కలిసి అంబర్పేట్ లోని ఎరుకల బస్తీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.

Latest Videos

తొమ్మిదిరోజుల కవలపిల్లలను సంపులో పడేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి.. కారణం తెలిస్తే...

ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలు ఇద్దరు తండ్రి వెంట  అతను పనిచేస్తున్న కారు సర్వీస్ సెంటర్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో గంగాధర్ కుమార్తెను పార్కింగ్ దగ్గర ఉన్న క్యాబిన్లో కూర్చోబెట్టాడు. కొడుకును తీసుకొని సర్వీస్ సెంటర్ లోపలికి వెళ్ళాడు. అక్కడ కొడుకు ఆడుకుంటున్నాడు. పనిమీద గంగాధర్ మరో వాచ్మెన్ తో కలిసి ఇంకో దగ్గరికి వెళ్ళాడు. కాసేపు సర్వీస్ సెంటర్ లోనే ఆడుకున్న ప్రదీప్ అనే ఆ చిన్నారి..  క్యాబిన్లో ఉన్న అక్క దగ్గరికి నడుచుకుంటూ వెళుతున్నాడు.

ఈ క్రమంలో అక్కడే ఉన్న వీధి కుక్కలు ఆ చిన్నారిని చూసి వెంటపడ్డాయి. వాటిని చూసి బాలుడు భయపడి పరుగులు తీశాడు.  అయినా అవి వదలలేదు. చిన్నారిని వేటాడుతూ ఒకదాని తర్వాత మరొకటి దాడి చేశాయి. ఓ కుక్క బాలుడి ఒక కాలును.. మరో కుక్క  బాలుడి చేయిని నోట కరచుకొని రెండు వైపులా లాగడంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. కుక్కల దాటికి తట్టుకోలేని ఆ చిన్నారి గట్టిగా ఏడుస్తూ, కేకలు వేశాడు. తమ్ముడి కేకలు విన్న  అక్క పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి…భయానక దృశ్యం కనిపించింది.

వెంటనే పరుగు పరుగున వెళ్లి విషయం తండ్రికి చెప్పింది. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి కుక్కలను అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో కుక్కలు బాలుడిని వదిలేసి పారిపోయాయి. అప్పటికే తీవ్ర గాయాల పాలైన చిన్నారిని తండ్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే తీవ్ర రక్తస్రావం కారణంగా బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

click me!