
కరీంనగర్: ఆదివారం తెల్లవారుజామున కరీంనగర్ (karimnagar) లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొట్టకూటికోసం కరీంనగర్ కు వచ్చి రోడ్డుపక్కన గుడిసెలు వేసుకుని జీవిస్తున్న కొందరిని కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి నిరుపేదల గుడిసెలపైకి దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
కరీంనగర్ కమాన్ వద్ద కొందరు వీధివ్యాపారులు గుడిసెలు వేసుకుని వుంటున్నారు. అయితే ఇవాళ ఉదయం నలుగురు యువకులు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళుతుండగా వీరి గుడిసెల వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా కారు అతివేగంతో గుడిసెలపైకి దూసుకెళ్లింది. ఇలా గుడిసెల్లో నిద్రిస్తున్నవారిపైనుండి కారు దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు.
కారు బీభత్సానికి చాలామంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా కొందరి పరిస్థితి విషయమంగా వుందని తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఓ మహిళ మృతదేహమైతే కారుకింద నలిగి నుజ్జనుజ్జయి పడివుంది. మిగతా ముగ్గురు మహిళలు హాస్పిటల్ కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కమాన్ చౌరస్తా వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కాపాడి హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు వున్నట్లు... వీరు ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి పరారైనట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును పరిశీలించిన పోలీసులు దీనిపై 9 ఓవర్ స్పీడ్ చలాన్లు వున్నట్లు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన యువకులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.