జూలై రెండో తేదిన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలో కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరనున్నారు.
ఖమ్మం:జూలై రెండో తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించనుంది.
జూలై రెండున నిర్వహించే కాంగ్రెస్ సభ ఏర్పాట్లు, విధి విధానాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమావేశమయ్యారు.ఈ సమావేశానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే సభ స్థలాన్ని మాణిక్ రావు ఠాక్రే పరిశీలించారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులపై ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన బీఆర్ఎస్ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. ఈ ఇద్దరు నేతలను తమ పార్టీల్లోకి చేర్చుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ లు ప్రయత్నించాయి. కాంగ్రెస్ లో చేరేందుకు ఈ ఇద్దరు నేతలు మొగ్గు చూపారు. జూలై రెండో తేదీన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి చేరనున్నారు.ఈ విషయాన్ని ఖమ్మంలో ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. జూలై రెండున ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించే సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.
also read:జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ సభ: భట్టి, ఠాక్రే భేటీలో పాల్గొన్న పొంగులేటి
కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయానికి ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు. ఏ పార్టీలో చేరాలనే విషయమై చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని మెజారిటీ నేతలు సూచించడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.