మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు బుధవారంనాడు హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు బుధవారంనాడు హైకోర్టును ఆశ్రయించారు. తాను సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు తీర్పును నిలిపివేయాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే ఈ విషయమై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది.
2018 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో తన భార్య పేరున ఉన్న ఆస్తులు, కేసుల వివరాలను సమర్పించలేదని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరావుపై మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు 2019 లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 25న కీలక తీర్పును వెల్లడించింది. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటేసింది. 2018 నుండి ఎమ్మెల్యేగా జలగం వెంకటరావు కొనసాగుతారని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పును నిలిపివేయాలని ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు వనమా వెంకటేశ్వరరావు. ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు తీర్పు అమలును నిలిపివేయాలని వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.వనమా వెంకటేశ్వరరావు పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే జలగం వెంకటరావు బరిలోకి దిగాడు. ఈ ఎన్నికల్లో జలగం వెంకటరావుపై వనమా వెంకటేశ్వరరావు 4 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
ఇదిలా ఉంటే నిన్న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి జలగం వెంకటరావు అందించారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను కలిసి తీర్పు కాపీని అందించారు.
also read:హైకోర్టు తీర్పును అమలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీని కోరా: జలగం వెంకటరావు
2018 ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత పరిణామాల్లో బీఆర్ఎస్ లో చేరారు. వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ లో చేరడంతో జలగం వెంకటరావు ఆ పార్టీకి కొంత దూరంగా ఉంటున్నారు. అయితే మొదటినుండి బీఆర్ఎస్ లోనే కొనసాగిన విషయాన్ని జలగం వెంకట్ రావు గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కూడ బీఆర్ఎస్ లో కొనసాగుతానని ఆయన ప్రకటించారు.