చైల్డ్ ఫోర్న్ వీడియోలు చూడడమే కాకుండా, షేర్ చేస్తున్న ఓ ఎంసీఏ స్టూడెంట్ ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో చిన్నారుల అశ్లీల వీడియోలను షేర్ చేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా దర్యాప్తు సంస్థ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఆ యువకుడిని అరెస్టు చేసినట్లు తెలిసింది. సదరు యువకుడు కొన్ని యేళ్లుగా అశ్లీల వీడియోలను చూస్తున్నాడు. దీంతోపాటు.. పలువురికి షేర్ చేస్తున్నట్లు గుర్తించారు.
అతడి మీద ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన దీక్షిత్ (24) హైదరాబాదులోని రామంతపూర్ లో ఉంటున్నాడు. అతను ఎంసీఏ థార్డ్ ఇయర్ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం తన వాట్సాప్ గ్రూపులో వేరే వాళ్ళు షేర్ చేసిన చిన్నారుల అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసుకున్నాడు.
వీటిని తన స్నేహితులతో కలిసి చూసేవాడు. ఆ తరువాత వాటిని వేరే గ్రూప్స్ లో షేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు షేర్ అవుతున్న విషయాన్ని పసికట్టిన అమెరికా దర్యాప్తు సంస్థ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ అతని ఫోన్ నెంబర్ ను గుర్తించింది.
ఈ మేరకు సమాచారాన్ని ఢిల్లీలోని రాయబార కార్యాలయానికి పంపించింది. ఆ రాయబార కార్యాలయ సిబ్బంది సమాచారాన్ని సిబిఐకి తెలిపారు. సిబిఐ అధికారులు తెలంగాణ సిఐడికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సిఐడి ఇన్స్పెక్టర్ బృందం ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టింది.
సదరు నెంబర్ కి వాట్సప్ గ్రూపుల ద్వారా వీడియోలు వస్తున్నట్లుగా గుర్తించింది. వెంటనే రాచకొండ కమిషనర్ డి.ఎస్ చౌహన్ కు నివేదికను పంపించారు. ఆ నివేదిక ప్రకారం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.