ఆ స్థానాల్లో టీఆర్ఎస్‌కు చుక్కలు చూపుతాం: కొండా సురేఖ

By narsimha lodeFirst Published Sep 30, 2018, 12:34 PM IST
Highlights

త్వరలో జరిగే ఎన్నికల్లో వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నట్టు మాజీ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. 


వరంగల్: త్వరలో జరిగే ఎన్నికల్లో వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నట్టు మాజీ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు.  కాంగ్రెస్ పార్టీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ పరకాల నుండి తాము పోటీ చేసేందుకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. రెండో టిక్కెట్టు ఇస్తే ఎవరు పోటీ చేయాలనే దానిపై  అప్పుడు నిర్ణయం తీసుకొంటామన్నారు.

వరంగల్ ఈస్ట్  స్థానం నుండి  టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడంతో కొండా దంపతులు మూడు రోజుల క్రితం  కాంగ్రెస్ పార్టీ లో చేరారు.  వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు కార్యకర్తలతో  కొండా దంపతులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కొండా సురేఖ తన అభిప్రాయాలను వెల్లడించారు. తాము కాంగ్రెస్ పార్టీలో  చేరే ముందు పార్టీ నాయకత్వం ముందు ఎలాంటి షరతులు పెట్టలేదన్నారు.  పార్టీలో చేరిన తర్వాత పరకాల నుండి తాము ఈ దఫా పోటీ చేస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద ప్రసావిస్తే సానుకూలంగా స్పందించారని ఆమె చెప్పారు.

తమకు ఒక్క టిక్కెట్టు‌ను ఖరారు చేశారని... రెండో టిక్కెట్టు విషయమై పార్టీ అధిష్టానం నుండి ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.  ఒకవేళ రెండో టిక్కెట్టు ఇస్తామంటే.. సుస్మితా పాటిల్ పోటీ చేయాలా..  ఇంకేవరు పోటీ చేయాలా అనే దానిపై  నిర్ణయం తీసుకొంటామని కొండా సురేఖ చెప్పారు.

వరంగల్ ఈస్ట్ నుండి తమ కూతురు సుస్మితాను పోటీకి దింపాలని తమ అనుచరులు  కోరుతున్నారని  ఆమె గుర్తు చేశారు. అయితే  పార్టీ అధిష్టానం ప్రకారంగా వ్యవహరిస్తామని  ఆమె ప్రకటించారు.

పరకాలలోని కాంగ్రెస్ పార్టీ నేతలను  కూడ  కలుపుకొని  తాము  ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని కొండా సురేఖ చెప్పారు. మరోవైపు భూపాలపల్లి,వరంగల్ తూర్పు, పరకాల, నర్సంపేట, వర్థన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లో  కూడ తాము ప్రచారాన్ని నిర్వహిస్తామని సురేఖ చెప్పారు. 

తాము పోటీ చేసే స్థానంతో పాటు ఇతర ఐదు సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు  శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తామన్నారు. పాలకుర్తిలో  కొండా మురళి ప్రచారం నిర్వహిస్తారని ఆమె చెప్పారు. 

తాము పార్టీ మారుతున్న సమయంలో  తమ వెంట వందలాది మంది కార్యకర్తలు  వచ్చారని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు చెబితేనే ప్రజలు ఓట్లు వేస్తారనే భ్రమలు తమకు లేవన్నారు.  ప్రజల్లో నిరంతరం ఉన్న వారిని ప్రజలు ఆదరిస్తారని ఆమె చెప్పారు.

తమ వెంట రాకుండా క్యాడర్ ను నిలువరించేందుకు టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు సాగబోవన్నారు.  తమపై నమ్మకం ఉన్నవారంతా తమతో కలిసి వస్తున్నారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

6 నియోజకవర్గాల్లో కాదు కదా.. 6 డివిజన్లలో కూడా.. కొండాకు అంత సీన్ లేదు

సత్తా చూపుతాం: కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు

కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్

దొరల కింద బతికేవాళ్లం కాదు.. సురేఖను లక్ష మెజారిటీతో గెలిపిస్తా: కొండా మురళీ

15 పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొండా సురేఖ..?

నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

click me!