సనత్ నగర్ బాలుడి హత్య కేసులో ఐదుగురి అరెస్ట్.. అది నరబలి కాదు.. చిట్టీల గొడవే బాలుడి ప్రాణం తీసింది...

By SumaBala Bukka  |  First Published Apr 21, 2023, 12:38 PM IST

బాలుడి తండ్రి వసీం ఖాన్,  హిజ్రాల మధ్య డబ్బుల విషయంలో గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు నేపథ్యంలోనే హిజ్రా బాలుడిని ఎత్తుకెళ్లి చంపేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఈ ఘటనను ఖండించారు. 


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని  సనత్ నగర్ లో కలకలం రేపిన నరబలి ఘటనలో  పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.  అది నరబలి కాదని, దారుణ హత్య అని తేల్చారు. బాలుడి తండ్రికి నిందితుడైన హిజ్రాకు మధ్య చిట్టీ డబ్బుల విషయంలో గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. హిజ్రాకు నలుగురు సహకరించారని… హిజ్రాతో పాటు  వారిని కూడా అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.  బాలుడి కిడ్నాప్ కు సహకరించిన నలుగురు వ్యక్తులు.. బాలుడి తండ్రి హిజ్రా మధ్య చిట్టి డబ్బుల విషయంలో గొడవలే కారణమని.. దీనికి నరబలికి సంబంధం లేదు అని డిసిపి శ్రీనివాసరావు తెలిపారు.

ఈ ఘటన మీద మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు.  రంజాన్ ఉపవాసం ఉన్న ఆ చిన్నారిని అతి దారుణంగా చంపడం అత్యంత విషాదకరమైన ఘటన అన్నారు. దోషులైన వారిని వదలమని తెలిపారు. బాలుడికి సంబంధించిన వీడియో, ఫొటోలు చూస్తే తట్టుకోలేమని.. అంత దారుణంగా చంపడానికి ఎలా మనసొప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Latest Videos

అప్పు తీర్చాలంటూ గత కొంతకాలంగా బాలుడి తండ్రి వసీంఖాన్.. హిజ్రాల మధ్య గొడవ జరుగుతుంది.  ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే, మొదట బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపించారు. గురువారం నాడు అమావాస్య కావడంతో..  ఆరోజే బాలుడిని చంపేయడంతో.. వారు నరబలిగా అనుమానించారు. కానీ మొదటి నుంచి పోలీసులు ఈ విషయంలో నరబలి కాదని చెబుతూ వస్తున్నారు. బాలానగర్ డిసిపి శ్రీనివాస్ ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు.

హైద్రాబాద్‌లో దారుణం: అమావాస్య నాడు ఎనిమిదేళ్ల బాలుడి నరబలి

అసలేం జరిగిందంటే… సనత్ నగర్ పారిశ్రామిక వాడలోని అల్లాదున్ కోటిలోవసీమ్ ఖాన్ రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. అతనికి వాజిద్ అనే 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అక్కడే స్థానికంగా నివసించే ఫీజాఖాన్ అనే ఓ హిజ్రా వాజీద్ ను హత్య చేసినట్లు  పోలీసులు తెలిపారు. చిట్టిల వ్యాపారం నిర్వహించే ఫిజాఖాన్ దగ్గర  బాలుడి తండ్రి  వసీంఖాన్  చిట్టి వేశాడు.  కాగా దీనికి సంబంధించిన డబ్బులను పిజ్జా ఖాన్ ఇవ్వలేదు. దీంతో గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే గురువారం కూడా వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం  రంజాన్ నమాజ్ కు వెళ్లి వస్తున్న ఆ చిన్నారిని నలుగురు వ్యక్తులు బస్తీలోని ఓ వీధిలో కిడ్నాప్ చేశారు.  ఆ చిన్నారిని ప్లాస్టిక్  సంచిలో మూటకట్టి  ఫిజా ఖాన్  ఇంటి వైపుకు వెళ్లారు.  బాలుడు కనిపించకపోవడంతో తండ్రి వసీంఖాన్ అంతటా వెతికిన తర్వాత సిసిటీవీ ఫుటేజీని పరిశీలించారు.  ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిమీద దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానికులను విచారించారు.  సీసీ టీవీ ఫుటేజీ ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు.

నిందితులు బాలుడిని అత్యంత కిరాతకంగా చంపేసి.. జింకలవాడ సమీపంలో ఉన్న ఓ నాలాలో వేశారు. ఈ విషయాన్ని విచారణలో వారు అంగీకరించారు. గురువారం అర్ధరాత్రి పోలీసులు స్థానికుల సహకారంతో నాళాలో చిన్నారి మృతదేహం కోసం వెతికారు. ఓ ప్లాస్టిక్ సంచిలో పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, వెలికి తీశారు. చిన్నారిని హత్య చేసిన తర్వాత నిందితులు బాలుడు ఎముకలను ఎక్కడికక్కడ విరిచి ఓ బకెట్లో కుక్కారు. ఆ తర్వాత బకెట్ను ప్లాస్టిక్ సంచిలో తీసుకొచ్చి నాలాలో విసిరేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే  ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారే హత్య చేసినట్లు తేలడంతో అరెస్టు చేశారు. 

click me!