యూట్యూబ్ లో దేనికి సంబంధించిన వీడియోలైనా దొరుకుతాయి. అలా కరెన్సీ తయారీ వీడియోలు చూసి ఫేక్ కరెన్సీ తయారు చేశారు కొంతమంది. వాటిని చలామణీ చేయబోయి అరెస్ట్ అయ్యారు.
హైదరాబాద్ : యూట్యూబ్ లో చూసి నకిలీ కరెన్సీ తయారు చేయడం నేర్చుకున్న వ్యక్తులు వాటిని చలామణి చేసేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. మైలార్ దేవ్ పల్లి ఠాణా పరిధిలో జరిగిన ఘటన వివరాలను మంగళవారం రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ గంగాధర్ రెడ్డి, మైలార్ దేవ్ పల్లి సీఐ మధు విలేకరులకు వివరించారు.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం, గౌరారానికి చెందిన బ్యాగరి అడమ్ (38) వనస్థలిపురంలో ఊంటూ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితులు మరో ఇద్దరు డ్రైవర్లు బి. భరత్ కుమార్ (35), బి. శంకర్ (42) లు కలిసి తేలికగా డబ్బు సంపాదించాలనే ఆలోచన చేశారు. అడమ్ సూచన మేరకు ముగ్గురు కలిసి యూ ట్యూబ్ లో నకిలీ కరెన్సీ తయారు చేసే విధానాన్ని నేర్చుకున్నారు. ప్రింటర్ ద్వారా తేలికగా తయారు చేయొచ్చని భావించారు.
నేషనల్ హెరాల్డ్ కేసు: ఈడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి గీతారెడ్డి
వారికి సహకరించడానికి నల్లకుంటలో స్టేషనరీ దుకాణం నిర్వహించే ఎం.మాధవగౌడ్, వనస్థలిపురానికి చెందిన స్టాంపు పేపర్లు విక్రయించే వి. వీర వెంకటదుర్గ మణికంఠం నాయుడి సహకారం అడిగారు. అంతా కలిసి నకిలీ రూ.500, 200, 100 నోట్లను తయారు చేశారు. లక్ష రూపాయలు విలువచేసే కరెన్సీని మార్కెట్లో చలామని చేయడానికి అడమ్, భరత్ కుమార్, శంకర్ లు కాటేదాన్ కు వచ్చారు. నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తుండగా మైలార్ దేవ్ పల్లి పోలీసులు, మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి లక్ష రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.