
ఒక్క వానకే హైదరాబాద్ కకావికలమయింది. ఈ తెల్లవారు జామున నాలుగు గుంటలపుడు మొదలయి సుమారు మూడు గంటల సేపు కురిసిన జడివానలో నగరం చెరువయింది. భారీ వర్షానికి రహదారులేవో, మ్యాన హోల్స్ ఎక్కడున్నాయో కనిపించని పరిస్థితి వచ్చింది. పొద్దునే తెరపి ఇచ్చినా నగరంలో గమ్యస్థానాలకు చేరుకోవడం పెద్ద సమస్యే అయికూర్చుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా 18 ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయని అధికారులు చెబుతున్నారు.
అంబర్ పేట్ ఛే నంబర్ చౌరస్తా, నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్ ముందు, మొజంజహి మార్కెట్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకు, బల్కంపేట పెట్రోల్ బంక్, చాదర్‌ఘాట్ నుంచి పుత్లిబౌలీ చౌరస్తా వరకు, అమీర్‌పేట ఇమేజ్ ఆస్పత్రి ఎదుట, కేసీపీ జంక్షన్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మార్గాల్లో వెళ్లాల్సిన వారు ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం మంచిదని అధికారులు సూచించారు.
నగరంలో 838 పాత భవనాలను గుర్తించి అందులో నివసించే వారిని ఖాళీ చేయిస్తున్నారు. వర్గం వల్ల ఈ భవనాలు ఏక్షణాన్నైనా కూలిపోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఎమర్జన్సీ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మునిసిపల్ మంత్రి కెటి రామారావు నిన్ననే జిహెచ్ ఎంసి, వాటర్ బోర్డు, జెన్కో అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.ఉదయం నుంచే జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు.
అమీర్‌పేట, ఎర్రగడ్డ ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వందలాదిగా నిలిచిపోయాయి. చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బేగంపేట, నిమ్స్, తార్నాక, గోల్నాక, పాత గాంధీ ఆస్పత్రి, మలక్‌పేట్ రైల్వే అండర్ బ్రిడ్జి, షేక్‌పేట నాలా, టోలిచౌకీ, నింబోలి అడ్డ, తిలక్‌నగర్, హిమాయత్‌నగర్, నల్లగొండ క్రాస్ రోడ్డు, చంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. నగర శివారులోని పలు లోతట్టు ప్రాంతాలు జటమయమవడంతో పాటు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నగరంలో ఇంకా రోడ్లు మరమ్మతు కొనసాగుతూ ఉంది. జూన్ ఒకటి నాటికి రోడ్ల మీద గుంతలు మాయం కావాలని సిఎం కెసిఆర్ హుకుం జారీ చేసినా, హైదరాబాద్ కోసం 15 రోజులు గడువు పొడిగించారు. రాత్రి వర్షంతో ఒక వైపు నగరం జలమయమయితే, మరొక వైపు రోడ్లిల్లా కొట్టుకు పోయి, కోసుకు పోయి, ప్రజలకు నరకం చూపిస్తున్నాయి.