50 వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్: రంగంలోకి హరీశ్ రావు, 13న సీఎంకి నివేదిక

By Siva KodatiFirst Published Jul 11, 2021, 4:48 PM IST
Highlights

ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ప్రస్తుతం ఎంత మంది ఒప్పంద, పొరుగుసేవల విధానంలో పనిచేస్తున్నారనే వివరాలను హరీశ్‌రావు పరిశీలిస్తున్నారు.

తెలంగాణలో త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఖాళీలకు సంబంధించి ఆర్థికశాఖ కసరత్తు చేపట్టింది. దీనిలో భాగంగా శనివారం కొన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఆదివారం మిగతా శాఖల కార్యదర్శులు, అధికారులతో సమావేశమయ్యారు. ఆయా శాఖలు గతంలో సమర్పించిన ఖాళీల వివరాలను ఆయన మరోసారి సమీక్షిస్తున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ప్రస్తుతం ఎంత మంది ఒప్పంద, పొరుగుసేవల విధానంలో పనిచేస్తున్నారనే వివరాలను హరీశ్‌రావు పరిశీలిస్తున్నారు. ఈ నెల 13న జరగనున్న మంత్రివర్గ సమావేశానికి ఖాళీలకు సంబంధించిన పూర్తి నివేదిక అందించాలని సీఎం కేసీఆర్‌ ఆర్థిక శాఖను ఆదేశించారు. అందుకు అనుగుణంగానే ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ... కేబినెట్‌కు నివేదిక సమర్పించనుంది.  

Also Read:నిరుద్యోగులకు శుభవార్త: తెలంగాణలో 50 వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం చెప్పారన్నారు. తెలంగాణ యువత భవిష్యత్తుకు భరోసానిచ్చేది టీఆర్ఎస్సేనని హరీశ్ రావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. సీఎం.. ఇప్పటికే లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని హరీశ్ తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపన జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 

click me!