మెతుకుసీమ మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసకున్న వరి రైతు రవికుమార్ కుటుంబాన్ని ఇవాళ వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు.
మెదక్: వరి వద్దన్న ముఖ్యమంత్రి (CM KCR) మనకు వద్దంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP President YS Sharmila) విరుచుకుపడ్డారు. అసలు రైతులు వరి పండిస్తే కొనబోమని చెప్పే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది..? అని ఆమె ప్రశ్నించారు. ఇలా కేసీఆర్ యాసంగిలో వరి వేయవద్దని అనడం, గతంలో సన్నబియ్యం సాగుచేసి దిగుబడి రాక నష్టపోవడంతో రైతు రవికుమార్(40) ఆత్మహత్య చేసుకున్నాడని షర్మిల ఆవేదన వ్యక్తం చేసారు.
శుక్రవారం మెదక్ జిల్లా (medak district) హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్ గ్రామానికి చెందిన కరణం రవికుమార్ (karanam ravikumar) అనే వరి రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ కు తన ఆత్మహత్యకు కారణాలను తెలియజేస్తూ ఓ సూసైడ్ లెటర్ (suicide letter) రాసిపెట్టి రవి చనిపోయాడు. ఈ క్రమంలోనే ఇవాళ(శనివారం) వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఇంటిపెద్దను కోల్పోయి తీవ్ర బాధలో వున్న వారితో మాట్లాడి ఓదార్చారు. అనంతరం రవికుమార్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కేసీఆర్ సర్కార్ ను డిమాండ్ చేస్తూ అక్కడే దీక్షలో కూర్చున్నారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ''ఎప్పుడు ఏ కాలం ఉంటుందో తెలియదు. ఎప్పుడు వానలు వస్తాయో తెలియదు. విత్తనాలు, ఎరువులు దొరుకుతాయో..దొరకవో తెలయదు. పంట బాగా పండుతదో... పండదో తెలియదు. ఆకరికి లాభం వస్తుందో... నష్టం వస్తుందో కూడా తెలియదు. అయినా కూడా రైతు భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తాడు. అంత గుండెనిబ్బరం ఉన్న రైతు గుండె బద్దలయ్యేలా, గుండె ఆగిపోయేలా కేసీఆర్ పాలన ఉంది'' అని షర్మిల అన్నారు.
''పొలాల్లో వడ్లు పండించాల్సిన రైతు ఈ రోజు ఎందుకు ఉరివేసుకుంటున్నాడు..? నాట్లు వేసుకోవాల్సిన రైతు నడిరోడ్డున ఎందుకు పడ్డాడు..? కేసీఆర్ నియంత పాలనతో రైతులు ఆగమైపోతున్నారు. పండించిన పంటను అమ్ముకోలేక వరి కుప్పల మీదే రైతులు ప్రాణాలు వదులుతున్నారు. వరి వేయవద్దని కేసీఆర్ చెబుతున్న మాటలకు అప్పులెలా తీర్చుకోవాలి, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థంకాక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు'' అని ఆందోళన వ్యక్తం చేసారు.
మెతుకుసీమలో వరి రైతు ఆత్మహత్య... బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల (ఫోటోలు)
''కామారెడ్డి జిల్లా (kamareddy district)లో చిన్న బీర్లయ్య వరి కుప్పపైనే కుప్ప కూలి పోయాడు. ఇదే జిల్లాలో రాజయ్య ఆ కుప్పల మీదే చనిపోయాడు. ములుగులో కుమార్ ఇక ప్రభుత్వం వడ్లు కొనేలా లేదని పురుగుల మందు తాగి చనిపోయాడు. కరీంనగర్ జిల్లాలో అయిలయ్య కూడా వడ్లు కొనేలా లేరని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వానాకాలం వడ్లు కొనకపోవడం, యాసంగి వరి వేయవద్దని చెప్పడంతో దాదాపు 30మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు'' అని షర్మిల పేర్కొన్నారు.
''శుక్రవారం రవికుమార్ అన్న కేసీఆర్ కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లేఖలో రవికుమార్ అన్న రాసిన మాటలు చూస్తే ఎవరికైనా కన్నీరు వస్తుంది. రవికుమార్ అన్న లేఖలో ‘నా పొలంలో వరి తప్ప మరే పంట పండదు. వరి వేసుకోవద్దని అంటున్నారు. ఇదివరకే వరి వేసుకున్నా...పెట్టుబడి ఎక్కువైంది. ఉత్పత్తి తక్కువ వచ్చింది. నష్టాలపాలయిపోయా... తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంటికి వచ్చి వరి వేసుకుందామని అనుకుంటే కేసీఆర్ గారు వరి వేసుకోవద్దని అంటున్నారు. వరి వేయకపోతే నేను ఇంకేం వేయాలి. నేను నా భూమిలో వేరే పంట వేసే పరిస్థితి లేదు. వరి వేసుకోకపోతే ఇక నేను ఉరి వేసుకోవాలి. ఇంకేం చేయగలను’ అంటూ బాధపడ్డాడు'' అని షర్మిల తెలిపారు.
''రైతు తన భూమిలో వరి పండుతుందని, మద్దతు ధర ఉందని వరి వేస్తాడు. రైతు హక్కు మద్దతు ధర. మద్దతు ధర అంటే... మీరు ఈ పంట పండించండి ప్రభుత్వం ఈ ధరకు కొనుగోలు చేస్తుందని రైతుకు భరోసాను కల్పించాలి. మద్దతు ధరకు వరి కొనుగోలు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ నిచ్చిన తర్వాత ఇప్పుడు వరి వేయవద్దనే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది..? ఒక సారి రైతులకు హామీనిచ్చిన తర్వాత వరి పంట కొనాల్సిన బాధ్యత మీకు లేదా..?'' అని షర్మిల నిలదీసారు.
''పంట పండించడం వరకే రైతు బాధ్యత. ఆ పంటను కొనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా..? ఆకరి గింజ వరకు కొంటామని మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కొనుగోలు చేయబోమని రైతులను మోసం చేస్తున్నాడు. వరి కొనబోమని చెప్పే హక్కు మీకు ఎక్కడిది..? రైతు పండించిన పంటకు మద్దతు ధర ఉంది కనుకనే కదా వారు ధైర్యంగా ఆ పంటను సాగుచేసేది. ప్రభుత్వాలే మాట తప్పడంతో రైతులు ఉరివేసుకోవాల్సి వస్తోంది. ఇందుకేనా కేసీఆర్ ను సీఎం చేసింది'' అని మండిపడ్డారు.
''బంగారు తెలంగాణ అన్నారు. రైతులకు బతుకే లేకుండా కేసీఆర్ నిరంకుశ పాలన చేస్తున్నారు. ఇది న్యాయమేనా..? వానాకాలం వడ్లతో పాటు యాసంగి వడ్లు కూడా కేసీఆర్ కొనాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం. రైతు ఎన్ని వడ్లు పండించినా వాటికి మద్దతు ధర కల్పించాలి. ఆ తర్వాత మీరు రా రైస్ చేసుకుంటారా..బాయిల్డ్ రైస్ చేసుకుంటారా...బంగారం చేసుకుంటారా మీ ఇష్టం. మీరు ఇక్కడ అమ్ముకుంటారా...బయట దేశాల్లో అమ్ముకుంటారా అన్నది మీ తలకాయ నొప్పి'' అని అన్నారు.
''వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు. ఇది ఒక నినాదం కావాలి. ఆత్మహత్యకు పాల్పడిన రవికుమార్ కుటుంబ సభ్యులను కలిసాం. చాలా దయనీయ పరిస్థితిలో ఆ కుటుంబం ఉంది. రవికుమార్ అన్న భార్యకు గుండెనొప్పి ఉంది. తల్లిదండ్రులు వృద్ధులు. రవికుమార్ ఇద్దరికీ కూడా పింఛన్ రాదు. రవికుమార్ అన్నకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. ఒక బిడ్డ పెండ్లి చేసాడు. ఇంకో బిడ్డ చదువుకుంటోంది'' అని తెలిపారు.
''రవికుమార్ కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హిమా ఫాలింగ్ వ్యాధి వల్ల రక్తం వస్తే ఆగే పరిస్థితి ఆ అబ్బాయికి లేదు. ఆ అబ్బాయికి మెడికల్ కర్చు చాలా అవుతుంది. రవికుమార్ కుటుంబానికి దాదాపు రూ.50 లక్షల వరకు అప్పులే ఉన్నాయి. వరి వేసుకోవద్దంటే ఇంకో దారి మాకు లేదని రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆత్మహత్య కాదు. కేసీఆర్ చేసిన హత్యే. కేసీఆర్ రైతు వ్యతిరేకి. రైతు వ్యతిరేక ప్రభుత్వం టీఆర్ఎస్. ఆత్మహత్య చేసుకున్న రవికుమార్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉంది'' అని షర్మిల అన్నారు.
''ఇంత వరకు కలెక్టర్ రాలేదు. ఎమ్మెల్యే వచ్చిందంట. బిక్షమేసినట్టు 10,000 రూపాయలు ఇచ్చారు. ఇదేమైనా మెహర్బానీ అనుకుంటున్నారా..? ఆ కుటుంబాన్ని చూసుకుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? రవికుమార్ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించేంత వరకు ఇక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేస్తా. కలెక్టరే వస్తాడో, ఎమ్మెల్యే వస్తుందో..ఎవరు నష్టపరిహారం ఇస్తారో ఇవ్వండి. రవికుమార్ అన్న కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇదే గ్రామంలో కూర్చుని నిరాహార దీక్ష చేస్తా'' అని వైఎస్ షర్మిల స్పష్టం చేసారు.