
ప్రముఖ జ్యోత్యిష్య పండితులు, పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి (mulugu ramalinga siddanthi ) శివైక్యం చెందారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారు.
పలు టీవీలు, యూట్యూబ్ ఛానెల్స్‌లో దిన, వార, మాస ఫలాలు చెబుతూ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి తెలుగు ప్రజలకు చేరువయ్యారు. దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిస్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలు ప్రజలకు తెలియ చేసిన ములుగు సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలలో, పూజా, హోమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వహించేవారు. ములుగు సిద్ధాంతిగా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించడానికి ముందు ఆయన ఎమ్ఆర్ ప్రసాద్ (mr prasad) పేరుతో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందారు. సీనీనటులు ఏవీఎస్ (avs), బ్రహ్మానందం (brahmanandam) వంటి వారితో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ములుగు సిద్ధాంతి మరణం పట్ల ఆయన శిష్యులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు