వైస్ ప్రెసిడెంట్ సార్.. మీరు త్వరగా కోలుకోవాలి: ఎంపీ సంతోష్ కుమార్

By Mahesh KFirst Published Jan 23, 2022, 6:36 PM IST
Highlights

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు. ఈ విషయంపై టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి మరోసారి కరోనా బారిన పడటం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న వెంకయ్యనాయుడు కరోనా బారిన పడినట్టు ఉపరాష్ట్రపతి సెక్రెటరీ ట్విట్టర్ హ్యాండిల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
 

హైదరాబాద్: ఉపరాష్ట్రపతి(Vice President) వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) కరోనా(Coronavirus) బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఈ విషయంపై టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్(Santhosh Kumar) స్పందించారు. ప్రియతమ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు కరోనా బారిన పడినట్టు తెలిసిందని ట్వీట్ చేశారు. ఆయన మరోసారి కరోనా బారిన పడటం బాధాకరం అని తెలిపారు. ‘వైస్ ప్రెసిడెంట్ సార్.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

 దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడినట్టు వైస్ ప్రెసిడెంట్ సెక్రెటరీ ట్వీట్ చేసింది.. తనతో కాంటాక్టులోకి వచ్చిన వారంతా వెంటనే ఐసొలేషన్‌లోకి వెళ్లాలని, ఆ తర్వాత కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకిందని పేర్కొంది. ఆయన వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఆయనతో కాంటాక్టులోకి వచ్చిన వారందరినీ ఐసొలేషన్‌లోకి వెళ్లాలని కోరారు. ఆ తర్వాత కరోనా టెస్టు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Minister Mekapati Gautham Reddy) కరోనా బారిన పడ్డారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా టెస్టు చేసుకున్నారు. ఈ టెస్టులో తనకు కరోనా పాజిటివ్ అని ఫలితం వచ్చింది.  

ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కరోనా(Coronavirus) బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్(Positive) అని తేలిందని వివరించారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు కంటే ఒక రోజు ముందు ఆయన కుమారుడు లోకేష్‌కు కరోనా సోకింది.

ఇదిలా ఉండగా, ఇన్సాకాగ్ తాజా రిపోర్ట్‌లో.. ‘కరోనా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో పలు మెట్రో నగరాలలో వ్యాపించడంతో పాటు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆ కారణంగానే ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఒమిక్రాన్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. మెట్రో నగరాల్లో నమోదవుతున్న ఎక్కువ కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే. కొన్నిచోట్ల ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన BA.2 వ్యాప్తి చెందుతుంది. S-జీన్ డ్రాప్-అవుట్ అనేది ఓమిక్రాన్ మాదిరిగానే జన్యు వైవిధ్యం’ అని పేర్కొంది. ఇప్పటివరకు చాలా ఒమిక్రాన్ కేసుల్లో లక్షణాలు లేనివి/తేలికపాటి లక్షణాలు ఉన్నవేనని తెలిపింది. అయితే ప్రస్తుత వేవ్‌లో ఆస్పత్రిలో చేరడం, ఐసీయూ కేసులు పెరిగాయని తెలిపింది. ముప్పు స్థాయి మారలేదని తెలిపింది. ‘Omicron ఇప్పుడు భారతదేశంలో సామాజిక వ్యాప్తి దశలో ఉంది.

ఇక, భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,33,533 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల (Corona cases) సంఖ్య 3,92,37,264కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా‌తో 525 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,89,409కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,59,168‌ మంది కరోనాతో మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి జయించినవారి సంఖ్య 3,65,60,650కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

click me!