వరంగల్ లో నకిలీ డాక్టర్.. నాలుగేళ్లలో 43వేలమందికి వైద్యం...

By Bukka SumabalaFirst Published Aug 4, 2022, 7:14 AM IST
Highlights

వరంగల్ లో ఓ ఫేక్ డాక్టర్ లీలలు బయటపడ్డాయి. అసలైన వైద్యుడిలా నమ్మిస్తూ నాలుగేళ్లలో 43వేలమందికి వైద్యం చేశాడు. నిజం బయటపడడంతో అరెస్టయ్యాడు. 

వరంగల్ : వరంగల్ లో ఓ నకిలీ వైద్యుడు దర్జాగా  అసలు వైద్యుడిలా చలామణి అవుతూ ఏకంగా నాలుగేళ్లలో.. 43 వేల మందికి వైద్యం చేశాడు. ఎట్టకేలకు అతని గుట్టు బయట పడింది. బుధవారం ఎలాంటి వైద్య విద్యా అర్హతలు లేకుండా చికిత్స చేసిన నకిలీ వైద్యుడిని, అతని సహాయకుడిని వరంగల్ కమిషనర్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగేళ్ల కాలంలో ఈ నకిలీ వైద్యుడు అసలు వైద్యులను మించిపోయి.. రోజుకు 30-40మంది చొప్పున సుమారు 43 వేల మందికి వైద్యం అందించాడని దర్యాప్తులో వెల్లడయిందని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం వివరాలను వెల్లడించారు.

వరంగల్ నగరానికి చెందిన ముజతాబా అహ్మద్ బీఫార్మసీ విద్యాభ్యాసాన్ని మధ్యలో ఆపేసి ఓ స్థానిక వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో వచ్చే డబ్బులు అతడికి సరిపోవడం లేదు. మరోవైపు డాక్టర్ సంపాదన అతడిని టెంప్ట్ చేసింది. ఇంకేముంది నకిలీ వైద్యుడి అవతారమెత్తాడు. ఎయిమ్స్ నుంచి  ఎంబిబిఎస్ చేసినట్టు నకిలీ ధ్రువపత్రం  సొంతంగా సృష్టించుకున్నాడు. నగరంలోని చింతల్ ప్రాంతంలో 2018లో హెల్త్ కేర్ ఫార్మసీ పేరిట ఆసుపత్రి ప్రారంభించాడు. అతడి సహాయకుడిగా దామెరకొండ సంతోష్ పని చేస్తున్నాడు. నిజమైన వైద్యుడినేనని ముజతాబ ప్రజలను నమ్మించాడు. 

టీఎస్ఎంసీ ఆన్ లైన్ డేటాబేస్ లో న‌కిలీ డాక్ట‌ర్ల గుర్తింపు.. కేసు న‌మోదు చేసిన సైబ‌ర్ క్రైమ్

చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు. అవసరం లేకుండానే రోగ నిర్ధారణ పరీక్షలు రాసి, మందులు ఇచ్చేవాడు. వ్యాధి చిన్నదైనప్పటికీ పెద్ద ఆస్పత్రులకు పంపించి కమీషన్లు దండుకునేవాడు. నకిలీ వైద్యుడిపై టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. దీంతో అసలు రంగు బయటపడింది. నకిలీ వైద్య ధ్రువపత్రాలతో పాటు రూ.1.90  లక్షల నగదు, ల్యాప్ టాప్, మూడు సెల్ఫోన్లు, ల్యాబ్ పరికరాలను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసినట్లు కమిషనర్ తెలిపారు. 

ఇదిలా ఉండగా, మార్చి మూడో తేదీన.. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నిర్వహించే ఆన్ లైన్ డేటాబేస్ లో న‌కిలీ డాక్ట‌ర్ల పేర్లు  న‌మోదైన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ మేరకు సమాచారం అందండంతో దీనిపై సైబ‌ర్ కైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. టీఎస్ఎంసీ రిజిస్ట్రార్‌ డాక్టర్ సీహెచ్ హ‌నుమంతరావు గ‌త నెల‌లో టీఎస్ఎంసీ డేటాబేస్‌లో నలుగురు నకిలీ వైద్యుల అక్రమ రిజిస్ట్రేషన్లు ఉన్నట్టు గమనించారు. దాన్ని కన్ ఫర్మ్ చేసుకున్న తరువాత ఈ వ్య‌వ‌హారంలో ఫిబ్రవరి 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. ఈ ఫిర్యాదు నేప‌థ్యంలో డాక్ట‌ర్ సీహెచ్ హనుమంతరావు వ‌ద్ద నుంచి పోలీసులు మరిన్ని వివ‌రాలు సేక‌రించారు.. “ TSMCలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు. డేటాబేస్ లో ఏ త‌ర‌హా న‌కిలీ రిజిస్ట్రేష‌న్లు గుర్తించారు. ఎలా డాక్టర్ల నమోదు అవుతుంది.. వంటి ప‌లు వివ‌రాలు అడిగారు’’ అని ఆయ‌న మీడియాతో తెలిపారు. 

click me!