లేడీ కానిస్టేబుల్ తో అఫైర్, ఆమె భర్త ఆత్మహత్య: ఎస్సై శివప్రసాద్ మీద సస్పెన్షన్ వేటు

By telugu teamFirst Published Jun 11, 2021, 8:46 AM IST
Highlights

మహిళా కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమె భర్త ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణపై ఇందల్వాయి ఎస్సై శివప్రసాద్ మీద సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఐజి ఉత్తర్వులు జారీ చేశారు.

కామారెడ్డి: ఓ మహిళా కానిస్టేబు్ల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమె భర్త ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్న నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఎస్సై శివప్రసాద్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఆయనను నిజామాబాద్ రేంజ్ ఐజీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

మహిళా కానిస్టేబుల్ భర్త శివాజీరావు ఆత్మహత్య కేసులో శివప్రసాద్ ను నిందితుడిగా చేర్చారు. అయనపై 306 నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కామారెడ్డి జిల్లా గాంధారి పోలీసులు కేసు నమోదు చేశారు. శివాజీరావు బార్య, కానిస్టేబుల్ సంతోషిని, ఎస్సై శివప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.

ఇదిలావుంటే, ఓ మహిళా కానిస్టేబుల్ తో ఎస్సై అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దాన్ని భరించలేని కానిస్టేబుల్ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాధవపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని డెగ్లూర్ మండలానికి చెందిన శివాజీరావు (35) కామారెడ్డి జిల్లా మాధవపల్లికి చెందిన మహిలను 2005లో పెళ్లి చేసుకున్నాడు. 

అప్పటి నుంచి వారు మాధవపల్లిలోనే ఉంటున్నారు. వారిద్దరికి ఓ కుమారుడు పుట్టాడు. అయితే, 2008లో ఆమె మరణించింది. దీంతో పెద్దల అంగీకారం మేరకు అతను 2010లో ఆమె చెల్లెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రస్తుతం రెండేళ్ల కూతురు ఉంది. కాగా, శివాజీరావు రెండో భార్యకు 2018లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. 

హైదరాబాదులో శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడే ప్రొబెషనరీ ఎస్సైగా పనిచేస్తున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసిది. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో అతనికి, కామారెడ్డి జిల్లా ఆమెకు పోస్టింగులు వచ్చాయి. రెండు ప్రాంతాలు కూడా 50 కిలోమీటర్ల లోపు దూరంలోనే ఉన్నాయి. దాంతో వారిద్దరు తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 

ఆ విషయంపై శివాజీరావుకు, అతని రెండో భార్యకు తరుచుగా గొడవలు జరుగుతూ వచ్చాయి. ఎస్సైతో సంబంధాన్ని తెంచుకోవాలని అతను పలుమార్లు ఆమెకు చెప్పాడు. అయినా కూడా భార్య వినలేదు. పైగా ఎస్సై అతన్ని వేధిస్తూ వచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థితిలో తీవ్ర మనస్తాపానికి గురై శివాజీ రావు మాధవపల్లిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

దానిపై తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామ ప్రజలు ఎస్సైని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు ప్రధాన రహదారిపై బైఠాయించారు. దాంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  గాంధారి ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పారు. కేసు నమోదు చేశామని, వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

click me!