తెలంగాణ మోడల్ పాలనే ఎజెండా.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడు..

By Mahesh RajamoniFirst Published Jun 8, 2023, 10:31 PM IST
Highlights

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్) నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మహారాష్ట్రపై దృష్టి సారించింది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రైతుల ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలను రైతులకు తెలియజేస్తూ మహారాష్ట్రలో ప్రచారంతో ముందుకు సాగాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గ్రామస్థాయి వరకు కార్యకర్తలను ఆకర్షించి వ్యూహరచన చేస్తున్నారు.
 

BRS-Maharashtra: 'తెలంగాణ మోడల్' పాలనే ఎజెండాగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ కార్యక్రమాన్ని 288 నియోజకవర్గాల్లో చేపట్టాలని ఆ పార్టీ అధినేత‌, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) పార్టీ శ్రేణుల‌కు సూచించారు. ప్రతి గ్రామంలోనూ అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో 9 కమిటీలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు క్ర‌మంగా పెరుగుతున్న నేపథ్యంలో గురువారం కూడా పలువురు మహారాష్ట్ర నుండి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ సీఎం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పాలన మోడల్ గురించి కరపత్రాలు , బుక్ లెట్స్ , సోషల్ మీడియా , పోస్టర్స్ , హోర్డింగ్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ పథకాలు అందించాలనే స్పూర్తితో బీఆర్ఎస్ పని చేస్తున్నదనీ, అక్కడి రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరిస్తున్న తీరు సంతోషకరమని సీఎం అన్నారు. ఎన్నో నదులు ఉన్నప్పటికీ మహారాష్ట్ర రైతులకు అక్కడి ప్రభుత్వాలు సాగు నీరు అందించలేకపోవడం బాధాకరమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.  ఎంతో మంది నాయకులు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారు గాని మహారాష్ట్ర ప్రజలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ చేపట్టామని పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి రైతులకు పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు , ఉచిత సాగు నీరు సహా వ్యవసాయ రంగం అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టి రైతులకు ఒక భరోసా కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ సుభాష్ రాథోడ్, సేనా సంఘటన్ నుంచి ఉమేష్ చవాన్, బీజేపీ పార్టీకి చెందిన సివిల్ ఇంజనీర్ దీపక్ పవార్, భారత్ పవార్, అకోలా బజార్ ఉప సర్పంచ్ అశోక్ రాథోడ్, ఉపాధ్యాయ్ సంఘటన్ యావత్మాల్ జిల్లాకు చెందిన అజయ్ రాథోడ్, బీజేపీ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ రాథోడ్, శివసేన సర్కిల్ ప్రముఖుడు రాజేశ్ పవార్, శివసేన షిండే వర్గానికి చెందిన పర్వీన్ చవాన్ తదితరులున్నారు.   

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు శంకరన్న దొండ్గే , మాణిక్ కదం , టీఎస్ఐడీసీ చైర్మన్ వేణుగోపాల చారి, హిమాన్షు తివారి తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్) నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మహారాష్ట్రపై దృష్టి సారించింది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రైతుల ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలను రైతులకు తెలియజేస్తూ మహారాష్ట్రలో ప్రచారంతో ముందుకు సాగాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గ్రామస్థాయి వరకు కార్యకర్తలను ఆకర్షించి వ్యూహరచన చేస్తున్నారు.

click me!