నేనెవ్వరికీ తలవంచలేదు.. కాళ్లు మొక్కలేదు : కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 13, 2023, 7:37 PM IST
Highlights

తన రాజకీయ జీవితంలో ఎవ్వరికీ తాను తలవంచలేదని, కాళ్లు మొక్కలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి. అయితే సౌమ్యుడిగా పేరొందిన కడియం శ్రీహరి ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేశారో తెలియరాలేదు.

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసినవాడే తలవంచుతాడని, తాను రాజకీయాల్లో ఇంత వరకు తలవంచలేదని ఆయన స్పష్టం చేశారు. ఇకపైనా తలవంచేది లేదని కడియం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే తన రాజకీయ జీవితంలో ఎవరికీ పాదాభివందనం చేయలేదని.. ఆర్జించడం కాదు, ఆత్మగౌరవంతో బతకాలని శ్రీహరి అన్నారు. అయితే సౌమ్యుడిగా పేరొందిన కడియం శ్రీహరి ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేశారో తెలియరాలేదు.

ఇదిలావుండగా.. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యల మధ్య రాజకీయ వైరం ఉన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య ఆదిపత్య పోరు కొసాగుతుంది. కడియం శ్రీహరి, రాజయ్యల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. గతేడాది కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ALso REad: కడియం శ్రీహరి 360 మంది నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయించారు.. రాజయ్య సంచలన ఆరోపణలు..

శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో 361 మంది నక్సలైట్లను పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే ఇంతమంది చనిపోయారని తెలిపారు. తనకు రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అయితే.. ప్రస్తుత సీఎం కేసీఆర్‌ దేవుడని రాజయ్య అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి తాను పూజారినని.. ఆ దేవుడిచ్చే వరాలతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ తన అడ్డా అని .. ఇక్కడ ఎవరినీ అడుగుపెట్టనివ్వబోను అని కామెంట్ చేశారు. 

ఇక, రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కడియం శ్రీహరి స్పందించారు. తనపై తీవ్ర ఆరోపణలు చేస్తావా అని ప్రశ్నించారు. రాజయ్య ప్రజల మద్దతు కోల్పోతున్నారని అన్నారు. ఘనపూర్ ఎవరి అడ్డ కాదని.. గత ఎన్నికల సమయంలో రాజయ్య విజయం కోసం తాము కూడా కష్టపడ్డామని చెప్పారు. నాలుగు సార్లు గెలిచిన రాజయ్య.. ఘనపూర్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. రాజయ్యకు ఏదైనా సమస్య ఉంటే అధిష్టానంతో చెప్పుకోవాలని అన్నారు. రాజయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 
 

click me!