ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితర నేతలు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మంగళవారం ఢిల్లీకి బయల్దేరిన వీరు.. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువురు నేతలు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు ఉదయం 9 గంటలకు వీరు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. అనంతరం వీరు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డి, ఎంపీపీ మెఘా రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ALso Read: భారీ వర్షాల ఎఫెక్ట్: పాలమూరు ప్రజా గర్జన సభ ఆగస్టు 5వ తేదీకి వాయిదా
నిజానికి కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని భావించారు. కానీ భారీ వర్షాల కారణంగా జూలై 20, జూలై 30న రెండుసార్లు ప్రియాంక పర్యటన వాయిదా పడింది. మరోవైపు ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వుండటంతో ప్రియాంక గాంధీ సభ వుండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జూపల్లీ ఈ ఢిల్లీ వెళ్లి ఖర్గే సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జూపల్లి వెంట టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి తదితరులు కూడా వున్నారు.