విద్యుత్ బిల్లుపై కేసీఆర్‌ వ్యాఖ్యలు : మునుగోడు ఉపఎన్నికలో ఆయనకు మీటర్ పెడదాం .. ఈటల కౌంటర్

By Siva KodatiFirst Published Sep 12, 2022, 4:25 PM IST
Highlights

కేంద్ర విద్యుత్ బిల్లు, వ్యవసాయ మోటార్లకు మీటర్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. మునుగోడులో గెలిచేది బీజేపీయేనని ఈటల జోస్యం చెప్పారు

వ్యవసాయ మోటార్లకు మీటర్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర విద్యుత్ బిల్లు విషయంగా కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైరయ్యారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని ఈటల రాజేందర్ అన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం ఆ మాట పదే పదే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో ఆయన ఇలాగే వ్యవహరించారని రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. మునుగోడులో గెలిచేది బీజేపీయేనని ఈటల జోస్యం చెప్పారు. ఈ ఉపఎన్నికలో ప్రజలంతా కలిసి సీఎం కేసీఆర్‌కు మీటర్ పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 

వ్యవసాయ మీటర్లకు సంబంధించి కేంద్రంపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్.. రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా కరెంట్ ఛార్జీలు పెంచారని ఈటల రాజేందర్ ఆరోపించారు. భారీగా వస్తోన్న కరెంట్ బిల్లులతో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని .. ఆయన మండిపడ్డారు. పేదలకు సబ్సిడీ పథకాలు అమలు చేసేందుకు కేంద్రం ఎప్పుడూ ముందుంటుందని, కేసీఆర్ మాత్రం కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును చూసి జనం అసహ్యించుకుంటున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. 

ALso Read:పోయే కాలం వచ్చింది, అధికారం నెత్తికెక్కి మాటలు: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీపై కేసీఆర్ ఫైర్

అంతకుముందు సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర విద్యుత్ సంస్కరణ బిల్లుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేరే పార్టీలను ఉంచబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర హోం మంత్రి ఇంత అప్రజాస్వామికంగా మాట్లాడొచ్చా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతల మాటలతో భరతమాత గుండెకు గాయమౌతుందన్నారు.. గాంధీ, బుద్దుడు పుట్టిన దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించాల్సిన అవసరం నెలకొందన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నారని బీజేపీ పై కేసీఆర్ మండిపడ్డారు.
 

click me!