కేంద్రం పేరు చెప్పి రైతుల మోటార్లకు మీటర్లు: కేసీఆర్ పై బండి సంజయ్

By narsimha lodeFirst Published Sep 12, 2022, 3:53 PM IST
Highlights


కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి  తెలంగాణలో రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ తెలంగాణ చీప్ బండి సంజయ్ ఆరోపించారు.రైతులకు ఉచితంగానే విద్యుత్ ఇవ్వాలన్నారు. 

హైదరాబాద్:కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి తెలంగాణ రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీజేపీ తెలంగాణ  చీఫ్ బండి సంజయ ఇవాళ్టి నుండి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. పది రోజుల పాటు  జీహెచ్ఎంసీ పరిధిలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర సాగుతుంది. 

కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం నాడు పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సభలో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామన్నారు. డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఇంతవరకు ఇవ్వలేదన్నారు. 30 గ్రామాలకు ఇచ్చే విద్యుత్ ను కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఉపయోగించుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఉత్తర్వులు ఇచ్చిందని కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. 

 నాళాలు, చెరువులు, కుంటలను టీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు.ఈ విషయాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు పాదయాత్ర చేస్తున్నట్టుగా బండి సంజయ్ చెప్పారు. పేద ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టీసీని  కేసీఆర్  ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.. ఆర్టీసీని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్నారు.

తెలంగాణ ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ఈ సమస్యలను పరిష్కరిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. గడీల పాలనను బద్దలు కొట్టేందుకు తమతో కలిసి రావాలని  బండి సంజయ్ ప్రజలను కోరారు..

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితిలో కేసీఆర్ సర్కార్ లేదన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదన్నారు.వీఆర్ఏ సమస్యలు పరిష్కరించకుండా కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గణేష్ నిమజ్జనం కోసం ఆంక్షలు విధించారని బండి సంజయ్ విమర్శించారు. పెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని బండి సంజయ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంటే కేసీఆర్ హడావుడిగా జాతీయ సమైక్యత దినోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు.ఇన్నిరోజుల పాటు ఎందుకు జాతీయ సమైక్యత దినోత్సవాలు  జరుపుకోలేదో చెప్పాలని బండి సంజయ్ అడిగారు. 

తెలంగాణ అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలను చూసి కేసీఆర్ భయపడుతున్నారన్నారు. మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు.అసెంబ్లీలో సమస్యల చర్చించకుండా అబద్దాలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. 

 

click me!