హెలికాప్టర్లలో తిరిగే ఏకైక ఐఏఎస్ స్మితా సబర్వాల్ మాత్రమే..: మాజీ ఐఏఎస్ మురళి

By Arun Kumar P  |  First Published Dec 14, 2023, 12:17 PM IST

బిఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఘాటుగా స్పందించారు.


హైదరాబాద్ : స్మితా సబర్వాల్... తెలంగాణ ప్రజలకు బాగా సుపరిచితమైన పేరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణకు కేటాయించబడ్డ ఈ ఐపిఎస్ అధికారిణి పాలనాపరమైన విషయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగానే కాదు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగానూ పనిచేసారు. ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఈమె రేవంత్ రెడ్డి సర్కార్ లో పనిచేసేందుకు సుముఖంగా లేరని... కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందువల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కనీసం మర్యాదపూర్వకంగా అయినా స్మితా సబర్వాల్ కలవకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

ఈ క్రమంలోనే స్మితా సబర్వాల్ పై మాజీ ఐఎఎస్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం తెలంగాణలో కాదు దేశం మొత్తంలోనే హెలికాప్టర్ పై వెళ్ళి ప్రభుత్వ పనులను పర్యవేక్షించిన ఏకైక ఐఎఎస్ స్మితా సబర్వాల్ మాత్రమేనని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కార్యాలయంలో కీలక అధికారిణిగా వున్నారు. అధికారాలన్ని చేతిలో వుండటంతో స్మితా సబర్వాల్ తప్పు చేసారనేలా మురళి కామెంట్స్ చేసారు. ఒకవేళ ఏ తప్పూ చేయకపోతే తెలంగాణలోనే కొనసాగకుండా కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు... ప్రభుత్వం మారగానే భుజాలెందుకు తడుముకుంటున్నారని మాజీ ఐఎఎస్ ప్రశ్నించారు. 

Latest Videos

తమకు అనుకూలంగా వున్న ప్రభుత్వంలో చేసినవన్నీ చేసేసి... కొత్త ప్రభుత్వం రాగానే  కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు వెళ్లడం కొందరు ఐఏఎస్ లకు ఫ్యాషన్ గా మారిందని మురళి మండిపడ్డారు. కేంద్ర పెద్దల పరిచయాలు, కులం, నెట్ వర్క్... ఇలా ఏదో ఒకటి ఉపయోగించి రాష్ట్రంలో చేసిన తప్పుల నుండి తప్పించుకునేందుకు కేంద్ర సర్వీసులకు ఐఏఎస్ లు వెళుతున్నారని ఆరోపించారు. ఇలా తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ లు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సిద్దమయ్యారని అన్నారు. కానీ అలాంటివారు ఎవ్వరినీ కేంద్ర సర్వీసులకు పంపకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ఆకునూరు మురళి. 

Also Read  కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడం లేదు, సీతక్కతో స్మితా సభర్వాల్ భేటీ:ఏం జరుగుతుంది?

ఎక్కడా స్మితా సబర్వాల్ పేరు ప్రస్తావించకున్న మురళి మాట్లాడింది ఆమె గురించే అని అర్థమవుతోంది. ఆమెను ఊరికే వదిలిపెట్టకూడదని... బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె అవినీతి, అక్రమాలకు పాల్పడింది అనేలా మాజీ ఐఏఎస్ వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎంవో కు ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికన ఈ సంచలన ట్వీట్ చేసారు మాజీ ఐఏఎస్ మురళి.

అయితే తాను కేంద్ర సర్వీసులకు వెళుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని స్మితా ఖండించారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని ఆమె మీడియా సంస్థలకు కోరారు. తాను తెలంగాణలోనే కొనసాగుతానని... ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్దమేనని అన్నారు. తన తెలంగాణ రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నానని స్మితా పేర్కొన్నారు.  

ఇక కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతర్వాత స్మితా సబర్వాల్ మొదటిసారి సచివాలయానికి వెళ్లారు.   సచివాలయంలో  మంత్రి సీతక్కను ఆమె కలిసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆమె కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 


 

click me!