తెలంగాణ ఉద్యమం.. కాంగ్రెస్ నాకు రూ.5 కోట్ల ఆఫర్ ఇచ్చింది, కానీ : మరోసారి రాజయ్య సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 28, 2023, 7:06 PM IST
Highlights

పార్టీని మారకుండా వుండేందుకు గాను అప్పట్లో కాంగ్రెస్ తనకు రూ.5 కోట్ల ఆఫర్ ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, వైఖరితో నిత్యం వార్తల్లో వుండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు. 

అయితే పార్టీని మారకుండా వుండేందుకు గాను అప్పట్లో కాంగ్రెస్ తనకు రూ.5 కోట్ల ఆఫర్ ఇచ్చిందని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ డబ్బు తనకు చెప్పుతో సమానమని భావించి రాజీనామా చేశానని గుర్తుచేశారు. తనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ బసవరాజు సారయ్యను పంపిందని రాజయ్య తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకున్న వారిని చూసి తనకు ఎమ్మెల్యే పదవి గడ్డిపోచతో సమానం అని రాజీనామా చేశానని చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్ ప్రజల రుణం తీర్చుకోలేనని రాజయ్య స్పష్టం చేశారు. 

ALso Read: 'బీఆర్ఎస్సే కాంగ్రెస్.. కాంగ్రెస్సే బీఆర్ఎస్’.. మరోసారి నోరు జారిన రాజయ్య, షాక్‌లో గులాబీ దండు

అంతకుముందు గత నెలలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలోనూ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్‌దే విజయమన్నారు. బీఆర్ఎస్సే కాంగ్రెస్, కాంగ్రెస్సే బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యానించారు. ఈసారి కూడా నిండు మనసుతో బీఆర్ఎస్‌ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని రాజయ్య వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న పార్టీ నేతలు , కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. అసలేం జరుగుతోందో వారికి అర్ధం కానీ పరిస్ధితి నెలకొంది. 

click me!