పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆటకెక్కాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ విషయమై కేసీఆర్ కు లేఖ రాశారు.
మహబూబ్ నగర్: తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారంనాడు లేఖ రాశారు. పాలమూరు - రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పనుల విషయమై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రస్తావించారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అటకెక్కిందని ఆయన విమర్శించారు. కుర్చీ వేసుకుని ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆ లేఖలో గుర్తు చేశారు.
వట్టెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదన్నారు. భూ నిర్వాసితులు సర్వం కోల్పోయి దయనీయస్థితిలో ఉన్నారన్నారు. పునరావాస ప్యాకేజీ కింద ఊరు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చూపుతుందని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సాగుతుంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో రిజర్వాయర్ల పనులను భట్టి విక్రమార్క పరిశీలించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కారణంగా ఉమ్మడి పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లాకు సాగు , తాగు నీరు సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై డిమాండ్ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి, కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులపై కేఆర్ఎంబీ, కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.