జగ్గా రెడ్డి సంగారెడ్డి జిల్లా అధికారులకు ఓ హుకుం జారీ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, అన్ని అధికారిక కార్యక్రమాలకు తన భార్య నిర్మలకు ఆహ్వానం అందించాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
హైదరాబాద్: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అధికారుల కోసం ప్రత్యేకంగా ఆయన ఆ వీడియో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. అధికార కార్యక్రమాలకు తన భార్య నిర్మలను అధికారులు ఆహ్వానించాలని హుకుం జారీ చేశారు.
2004, 2014, 2018లలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తున్న తరుణంలో సంగారెడ్డి నుంచి గెలిచి.. ఈ సారి కాంగ్రెస్ హవా సాగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలిచారు. ఈ సందర్భంగా జగ్గా రెడ్డి ఓ వీడియో చేశారు.
గతంలో తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినా.. అధికారంలో బీఆర్ఎస్ ఉన్నదని, అప్పుడు అధికార కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రతిపక్షంలోని బీఆర్ఎస్ నేత చింతా ప్రభాకర్‌ను అధికారులు ఆహ్వానించేవారని జగ్గా రెడ్డి తెలిపారు. తాను కూడా అభ్యంతరం చెప్పకుండా హుందాగా వ్యవహరించానని అన్నారు. అయితే, ఈ సారి మాత్రం సంగారెడ్డి జిల్లాలో పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉన్నదని, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని, కాబట్టి, తాను ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయినా అన్ని అధికారిక కార్యక్రమాలకు తనకు ఆహ్వానం అందాల్సిందేనని స్పష్టం చేశారు.
Also Read: Rythu Bandhu: రైతు బంధుపై పొలిటికల్ హీట్.. ఎప్పుడిస్తారని హరీశ్ రావు ప్రశ్న.. మంత్రి సీతక్క సమాధానం
నియోజకవర్గంలో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమాలకు అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తనకు ఆహ్వానం అందించాలని, ఇది చాలా క్లియర్‌గా చెబుతున్నానని జగ్గా రెడ్డి అన్నారు. తన తరఫున తన భార్య నిర్మలను ఆహ్వానించాలనీ హుకుం జారీ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నది.
Also Read: TTDP: ఆగ్రహంలో తెలుగు తమ్ముళ్లు.. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమిటీ?
ఈ వీడియోను బీఆర్ఎస్ నేతలు పోస్టు చేసి కాంగ్రెస్ పై విమర్శలు సందిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు తన భార్యను ఆహ్వానించాలని జిల్లా అధికారులకు కాంగ్రెస్ లీడర్ జగ్గా రెడ్డి ఆర్డర్ చేస్తున్నారని క్రిశాంక్ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియో జగ్గా రెడ్డి మాట్లాడిన దానిలో కొద్ది భాగమే. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రౌడీయిజమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.