ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు: ట్రావెల్స్ సంస్థలో కీలక ఆధారాల సేకరణ

By narsimha lodeFirst Published Sep 20, 2022, 10:13 AM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు దర్యాప్తును  వేగవంతం చేశారు. నిన్న బిల్డర్ శ్రీనివాసరావును ఈడీ అధికారులు సుమారు ఆరు గంటలకు పైగా విచారించారు. హైద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రావెల్స్ సంస్థలో కూడ ఈడీ అధికారులు సోదాలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.ఈ స్కాంలో ఎవరెవరికి సంబంధాలున్నాయనే విషయమై  ఈడీ అధికారులు ఆరాతీస్తున్నారు.  హైద్రాబాద్ కేంద్రంగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ నెల 16న దేశంలోని 40 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే హైద్రాబాద్ లోనే సుమారు పదికిపైగా చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

నిన్న ఉదయం నుండి ఈడీ అధికారులు సోదాలు ప్రారంభించారు. హైద్రాబాద్, కరీంనగర్ ప్రాంతాలలో  ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. హైద్రాబాద్ కు చెందిన బిల్డర్ శ్రీనివాసరావు ఇంటితో పాటు కరీంనగర్ కు చెందిన ఆయన నివాసాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైద్రాబాద్ లో ఉన్న మూడు ఐటీ సంస్థలతో పాటు రెండు రియల్ ఏస్టేట్ సంస్థలపై  కూడా ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సమయంలోనే  ఓ ట్రావెల్స్ సంస్థ వ్యవహరం వెలుగు చూసిందని సమాచారం. ఢిల్లీకి వెళ్లేందుకు అవసరమైన విమాన టికెట్లతో పాటు ప్రత్యేకంగా విమానాన్ని ఈ ట్రావెల్స్ సంస్థ బుక్ చేసిందని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ ట్రావెల్స్ సంస్థ నుండి ఈడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్రావెల్స్ సంస్థలో ఈడీ అధికారుల సోదాలు  మంగళవారం నాడు ఉదయం ముగిశాయి.

బిల్డర్  శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత ఆయనను ఈడీ అధికారులు హైద్రాబాద్ లోని తమ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. సుమారు ఆరు గంటలకు పైగా శ్రీనివాసరావును ఈడీ అధికారులు ప్రశ్నించారు.  సోమవారం నాడు రాత్రి పది గంటల తర్వాత శ్రీనివాసరావు ఈడీ కార్యాలయం నుండి తన ఇంటికి తిరిగి వెళ్లారు. అరుణ్ రామచంద్ర పిళ్లై, గండ్ర ప్రేమ్ సాగర్ రావుతో కలిసి శ్రీనివాసరావు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఈడీ అధికారులు గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో శ్రీనివాసరావుకు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ్ సాగర్ రావుకు శ్రీనివాసరావుకు మధ్య బంధుత్వం ఉంది. 

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: ఆరు గంటలకు పైగా బిల్డర్ శ్రీనివాసరావు విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో హైద్రాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై పేరును కూడా సీబీఐ చేర్చింది. అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు గతంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

click me!