ఈడీ దగ్గర చీకోటితో ఎమ్మెల్యేల ఛాట్ డిటైల్స్.. టెన్షన్ లో నేతలు, ప్రముఖులు..

By Bukka SumabalaFirst Published Aug 10, 2022, 1:01 PM IST
Highlights

కాసినో వ్యవహారంలో అరెస్టైన చీకోటి ప్రవీణ్ తో ప్రముఖులు, రాజకీయనేతలు చేసిన చాట్ ను ఈడీ రికవర్ చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మాజీల్లో గుబులు మొదలయ్యింది. తమని ఈడీ పిలిస్తే ఏం చెప్పాలన్న దానిమీద మల్లాగుల్లాలు పడుతున్నారు.

హైదరాబాద్ : క్యాసినో వ్యవహారంలో హవాలా వ్యవహారం ఇప్పుడు పలువురు రాజకీయ నేతలను, ప్రముఖులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చీకోటి ప్రవీణ్ కుమార్ తో సన్నిహితులుగా ఉన్నవారితోపాటు ఆయన కస్టమర్లుగా ఉన్నవారి మెడకు ఈడీ ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది. చీకోటి ప్రవీణ్ వాట్సాప్ ద్వారా సందేశాలు సాగించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఇప్పటికే తీవ్ర చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. క్యాసినో హవాలా దందాపై చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి, సంపత్, గౌరీ శంకర్ తదితర నిందితుల నివాసాల్లో సోదాలతోపాటు నాలుగు రోజులపాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించింది. 

అయితే, ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన సంచలనాత్మకమైన వాట్సాప్ సందేశాలతో  ఓ మంత్రితోపాటు పలువురు ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయని ఈడీ బలంగా విశ్వసిస్తోంది. దీనికి తగ్గట్టుగా సాగిన వాట్సాప్ చాట్ లను రిట్రీవ్ చేసిన ఈడీ సంబంధిత ప్రముఖలకు శ్రీముఖాలు జారీ చేయాలని భావిస్తోంది. ఈడీ నిజంగానే తమను పిలుస్తుందా? పిలిస్తే ఏంటన్న పరిస్థితిపై ఎమ్మెల్యేలు ఒకరికొకరు చర్చించుకుంటున్నట్టు అనుచరుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

న‌ల్గొండలో దారుణం.. ప్రేమను కాదన్నదని, యువ‌తిపై ప్రేమోన్మాది క‌త్తితో దాడి

క్యాసినో.. హవాలా..
ఈడీ పిలిస్తే ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశముందనే అంశాలపై లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లతో పలువురు ఎమ్మెల్యేలు చర్చిస్తున్నట్లు తెలిసింది. క్యాసినోకు ఎన్నిసార్లు వెళ్లారు. ప్రవీణ్ కు అందించిన డిపాజిట్.. అందులో హవాలా వ్యవహారం ఏంటన్న అంశాలను నెమరేసుకుంటున్నట్లు తెలిసింది. డిపాజిట్ కు పంపిన డబ్బుకు లెక్క చెప్పాల్సి వస్తే ఏం చేయాలన్న దాని మీద సీఏలతో చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

అయితే, కేవలం క్యాసినోకు వెళ్లినవారిలో పెద్దగా భయం లేకున్నా, క్యాసినో చాటున హవాలా వ్యవహారం సాగించిన వారిలోనే తీవ్ర అలజడి నెలకొన్నట్లు తెలుస్తోంది. హవాలా సాగించే అంత రేంజ్ ఉన్న నేతలు ఎవరన్న దానిమీద ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 

హవాలా ఆధారాలు ఉంటే...
చీకోటి ప్రవీణ్ ఈడీకి ఏం చెప్పాడు, ఎవరెవరు ఎన్నిసార్లు వచ్చారు. డిపాజిట్ చేసిన మొత్తంలో క్యాసినోకు ఉపయోగించిందెంత, మిగిలిన హవాలా ఎంత అన్న అంశాలపై తలపై నేతలు ఆరాతీస్తున్నారు ఒకవేళ హవాలా వ్యవహారంలో ఈడికి పక్కాగా ఆధారాలు దొరికితే పరిస్థితి ఏంటి అన్న దానిపై కూడా నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. పైగా తమను విచారణకు రావాలని నోటీసు ఇస్తే రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న భయం కూడా నేతల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ దాడులపై రాజకీయంగా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. బిజెపి నేతలు నిత్యం ఈడీ దాడులపై ప్రకటనలు చేస్తూ ఉండటం ప్రముఖ నేతలకు నిద్ర పట్టకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది నేతలు చీకోటిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే ఈడీ విచారణలో తెలిపిన అంశాలు ఏ మాత్రం బయటకు పొక్కినా చట్ట ప్రకారం కొత్త కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన తరఫు లాయర్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో క్యాసినో జాబితాలో ఉన్న వారంతా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.
 

click me!