ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌: 20వ తేదీన విచారణకు రండి.. ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

By Sumanth KanukulaFirst Published Mar 16, 2023, 2:27 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి నోటీసులు జారీచేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 20వ తేదీన విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. వాస్తవానికి  కవిత ఈరోజు ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాను విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు.. ఈ నెల 20వ తేదీన విచారణకు హాజరుకావాలని మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను విచారించే ఉద్దేశంతో ఈడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ ముగియనుండటంతో.. దానిని పొడిగించాలని కూడా ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును కోరారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత కేంద్రంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 11న కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో 8 గంటలకు పైగా కవితను విచారించిన ఈడీ అధికారులు.. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచేశారు. ఈ నేపథ్యంలోనే కవిత నేడు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలోనే తన తండ్రి,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఉన్న కవిత.. విచారణకు గైర్హాజరు అయ్యారు. 

ఈ క్రమంలోనే కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 24కి సుప్రీంకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా కవిత లేఖలో ప్రస్తావించారు. తాను వ్యక్తిగతంగా రావాలని సమన్లలోని ఎక్కడ పేర్కొనలేదని.. తన ప్రతినిధిగా భరత్‌ను ఈడీ కార్యాలయానికి పంపుతున్నానని చెప్పారు. సమన్లలో అడిగిన వివవరాలను కూడా భరత్ ద్వారా పంపుతున్నానని చెప్పారు. 

ఈ క్రమంలోనే ఈడీ కార్యాలయానికి చేరుకున్న బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ మాట్లాడుతూ.. కవిత ఈరోజు ఈడీ ఎదుట హాజరుకావడం లేదని చెప్పారు. ఆమెను ఈడీ కార్యాలయానికి పిలిపించడం చట్టవిరుద్ధమని అన్నారు. మార్చి 24న సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే హాజరవుతారని పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా చూపి కవిత విచారణకు హాజరుకావడం లేదనడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. 

 

click me!